ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈనె 26 నుంచి 31 వరకు చేపట్టే సిపిఎం మహాపాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.రామాంజనేయులు, జిల్లా నాయకులు గోవిందు కోరారు. గురువారం స్థానిక సుందరయ్య భవనంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లు ఇచ్చి పనులు ప్రారంభించాలని కోరారు. రైతుల పంటలు నిల్వ కోసం మండలానికి ఒక శీతల గిడ్డంగిని నిర్మించాలని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమలు నిర్మించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని కోరారు. ఆదోనిలో 300 పడకల ఆస్పత్రిని, ఎమ్మిగనూరులో వంద పడకల ఆస్పత్రిని, ప్రతి మండలంలో 50 పడకల ఆస్పత్రులను నిర్మించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తెలిపారు. కర్నూలు నుంచి విజయవాడకు రెగ్యులర్‌గా రైలు నడపాలని డిమాండ్ చేశారు. పత్తికొండలో టమోటా జ్యూస్ పరిశ్రమలను నిర్మించాలన్నారు. ఆదోని, ఎమ్మిగనూరు మధ్య టెక్స్‌టైల్ పార్కును నిర్మించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఉపాధి పని దినాలను పెంచి వలసలను ఆపాలని తెలిపారు. మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు మీదుగా కర్నూలుకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పట్టణ నాయకులు రాముడు, లక్ష్మీనరసయ్య, అబ్దుల్లా, కృష్ణ, ఆంథోని, రాజు, కాలప్ప, నల్లన్న, డివైఎఫ్‌ఐ నాయకులు సురేష్ పాల్గొన్నారు.
గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు










