Aug 05,2023 19:29

పరిసరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి - ఆదోని
కాన్పు కోసం వచ్చే పేదల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు వారి పని వారు చేసుకునే విధంగా చేయాలని, ప్రతి సమస్యనూ రాద్ధాంతం చేయవద్దని, వైద్యులు మంచి సేవలు అందిస్తున్నారని, వారికి సహకరించాలని మీడియా ప్రతినిధులకు హితవు పలికారు. శనివారం ఆదోనిలోని స్త్రీలు, చిన్నపిల్లల ప్రభుత్వాస్పత్రిలో సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అధ్యక్షతన ఆస్పత్రి సలహా సంఘం సమావేశం జరిగింది. స్త్రీలు, చిన్నపిల్లల ఆస్పత్రిలో ఉన్న సమస్యలను సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ లేకపోవడంతో జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు సూచించారని, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చినా, కాన్పుల కోసం వచ్చినా వైద్యులు బీపీ ఎక్కువగా ఉందని, రక్తం తక్కువగా ఉందని చెప్పి బయటకు పంపుతున్నారని, పేదలు నష్టపోతున్నారని, మరికొందరు మృత్యువాత పడుతున్నారని మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ... ప్రతిదానిని రాద్ధాంతం చేయవద్దని, సమస్యలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం వైద్యులు బాగా పని చేస్తున్నారని, వారికి సహకరించాలని కోరారు. ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల వైద్యులు మంచి సేవలు అందిస్తున్నారని, రోగులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాన్పు కోసం వచ్చే వారి పరిస్థితి సీరియస్‌గా ఉంటేనే కర్నూలుకు పంపిస్తున్నామని, కర్నూలుకు వెళ్లడానికి అంబులెన్స్‌ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రోజూ ఆస్పత్రిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని, రోజూ ఒపి ఉదయం 9 నుంచి 1 గంట వరకు ఉంటుందని తెలిపారు. తర్వాత వైద్యులందరూ ఆస్పత్రిలోనే అందుబాటులో ఉంటారని, ఈ విషయాన్ని వైద్యులు కూడా కచ్చితంగా పాటించాలని చెప్పారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆదోని నియోజవర్గంలో మెడికల్‌ కళాశాలను నిర్మిస్తున్నారని, త్వరలోనే డిఎంఇ వ్యవస్థ ఇక్కడే ఉంటుందని తెలిపారు. అన్ని రకాల వైద్య సేవలు అందుతాయని, కొత్తగా నిర్మించిన ఆస్పత్రి భవనాలను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ మజార్‌ అహ్మద్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ బోయ శాంత, మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, ఎంపిడిఒ గీతావాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మాధవి లత, సలహా సంఘం సభ్యులు జిలేఖాబీ, నాయకులు కల్పవల్లి పాల్గొన్నారు.