Oct 26,2023 22:45

మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరావు


ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌
మేలురకపు విత్తనాలు, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక స్పందన సమావేశ మందిరంలో శుక్రవారం దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'రబీ పంటలో సాగు మెళకువలు'పై శిక్షణా కార్యక్రమం గురువారం జరిగింది. కార్యక్రమంలో దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ ఎనవివి దుర్గా ప్రసాద్‌ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు సరైన సమయంలో సాంకేతిక సలహాలను అందించాలన్నారు. దర్శి వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బి.ప్రమీలారాణి మాట్లాడుతూ వివిధ పంటలలో రసాయనాలు ఉపయోగించి తక్కువ ఖర్చుతో సమర్ధవంతంగా కలుపును నివారించవచ్చన్నారు. శాస్త్రవేత్త టి.వెంకటేశ్వర రెడ్డి రబీలో సాగు చేసే పంటలైన శనగ, మినుముకు సంబంధించి అనువైన కొత్త వంగడాలపై శిక్షణ ఇచ్చారు. కెవికె శాస్త్ర వేత్త ఎం.జాహ్నవి మాట్లాడుతూ రబీ కాలంలో సాగు చేసే ప్రధాన పంటలను ఆశించే పురుగులు, తెగుళ్ళకు సంబంధించి నివారణ చర్యలను వవిరించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు బి.రమేష్‌ బాబు మాట్లాడుతూ ఈ-పంటలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇ.నిర్మల కుమారి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల నుంచి నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు, సింగరాయకొండ వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలోని 11 మండలాలకు చెందిన మండల వ్యవసాయ అధికారులు, 10 మంది వ్యవసాయ, విస్తరణ అధికారులు, 170 మంది రైతు భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.