Apr 21,2023 22:29

pariseelistunna collector

మెడికల్‌ కళాశాల పనులు వేగంగా పూర్తి చేయాలి : రాజబాబు

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌
జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మచిలీపట్నంలో 75 ఎకరాల్లో రూ.550 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. మచిలీపట్నం నుంచి కరగ్రహారానికి వెళ్లే మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల భవనాన్ని, తరగతి గదులను, వసతి గృహాలను పరిశీలించిన కలెక్టర్‌ , వీలైనంత త్వరగా చివరిదశ పెండింగ్‌ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య కళాశాల పనుల పురోగతిపై కలెక్టర్‌ సంతప్తి వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు సివిల్‌, ఎలక్ట్రికల్‌, వాటర్‌ సప్లరు సంబంధిత పనులను వేగవంతం చేయాలని తెలిపారు. సెంట్రల్‌ రిసెప్షన్‌ రూమ్‌, ఔట్‌ పేషెంట్‌ రూమ్‌, మెడిసిన్‌, సర్జరీ, ఆర్థోపెడిక్స్‌ కోసం ప్రత్యేక గదులు, పిల్లల వార్డు, గుండె సంబంధిత సమస్యల చికిత్స ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ పి. రాజాబాబు తెలిపారు. అన్ని పనులను పూర్తి చేసిన తర్వాత ఇండియన్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ బందం ఆసుపత్రిలో అభివద్ధి చేసిన సౌకర్యాలను పరిశీలించి, మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ ప్రారంభానికి అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. స్థానిక శాసనసభ్యులు పేర్ని నాని మాట్లాడుతూ, ప్రభుత్వం మచిలీపట్నంలో వైద్య కళాశాలల నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిందన్నారు. మచిలీపట్నంలో నిర్మితమవుతున్న వైద్య కళాశాల ఏడు నియోజకవర్గాలకు తలమానికంగా మారనున్నట్లు తెలిపారుముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో మే 31వ తేదీ 2021 వర్చువల్‌ విధానంలో వైద్య కళాశాల పనులకు శంకుస్థాపన చేశారని, కేవలం రెండు సంవత్సరాల కాలవ్యవధిలో మెడికల్‌ కళాశాల ఆధునిక ఇంజనీరింగ్‌ విధానాలతో సర్వాంగ సుందరంగా శరవేగంగా రూపొందిందని ఆయన సంతప్తి వ్యక్తం చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వెంట బందరు ఆర్డిఓ ఐ. కిషోర్‌, తహసిల్దార్‌ డి. సునీల్‌ బాబు, మెగా ఇంజనీరింగ్‌ ఇన్ఫ్రా లిమిటెడ్‌ సైట్‌ ఇంజనీర్‌ జగదీష్‌, లంకె వెంకటేశ్వరరావు,శొంటి ఫరీద్‌ పాల్గొన్నారు.