అమెరికా : మనిషి మెదడు పనితీరును తెలుసుకునే హెల్మెట్ వచ్చేసింది..! దీని ప్రత్యేకత ఏంటంటే.. మీ మెదడును పూర్తిగా చదివేస్తుంది. దీని ద్వారా మెదడు పని తీరును తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ అద్భుతమైన హెల్మెట్ ను అమెరికాకు చెందిన కెర్నల్ సంస్థ అభివృద్ధి చేసింది. రాబోయే కొన్ని వారాల్లోనే అమెరికాలో ఈ హెల్మెట్ అందుబాటులోకి రానుంది.
హెల్మెట్ ఎలా పని చేస్తుందంటే...
హెల్మెట్ లాంటి ఈ పరికరాన్ని వ్యక్తి తలకు అమరుస్తారు. హెల్మెట్‌లోని లేజర్ కిరణాలు పుర్రె ద్వారా మెదడులోకి ప్రవేశిస్తాయి. మెదడులోని కొన్ని కోట్ల సంఖ్యలో న్యూరాన్లు ఉంటాయి. మనకు ఎలాంటి భావోద్వేగం కలిగినా ఇవి ప్రతిస్పందిస్తాయి. మన ఆలోచనలన్నింటికి ఇవే మూలం. అందువల్ల మెదడులోకి ప్రవేశించిన లేజర్ కిరణాలు న్యూరాన్ల పని తీరును ఈ హెల్మెట్ పసిగట్టి ఆ ప్రక్రియను రికార్డు చేస్తుంది.
ఐదేళ్ల శ్రమ.. రూ.815 కోట్లు ఖర్చు : కెర్నల్ సంస్థ సీఈవో బ్రియాన్ జాన్సన్
ఈ హెల్మెట్‌ను ఎవరైనా ధరించవచ్చని, దీనిని రూపొంచడానికి తాను ఐదేళ్లు శ్రమించినట్లు బ్రియాన్ జాన్సన్ తెలిపారు. కెర్నెల్ కంపెనీ తయారు చేసిన హెల్మెట్ అందుబాటులోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. సరికొత్త టెక్నాలజీతో తయారు చేసిన హెల్మెట్ తయారికీ ఇప్పటి వరకు దాదాపు రూ.815 కోట్లు ఖర్చు పెట్టానని జాన్సన్ పేర్కొన్నారు.
ఈ హెల్మెట్ ధర 50 వేల డాలర్లు మాత్రమే
కెర్నల్ సంస్థ ఈ హెల్మెట్లను పదుల సంఖ్యలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ హెల్మెట్ ధర 50 వేల డాలర్లు మాత్రమే. అయితే కెర్నల్ అభివృద్ధి చేసిన పరికరాల్లో రెండు రకాలున్నాయి. ఒకటి ఫ్లో, రెండోది ఫ్లక్స్ ఫ్లో. బ్రెయిన్ ఇంటర్ఫేస్ ద్వారా మెదడు రియల్ టైం డేటాను రికార్డు చేయవచ్చు. దానికి అమర్చిన లేజర్ పరికరాల ద్వారా మెదడు కార్యకలాపాల కచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. 'కెర్నల్' సంస్థ హెల్మెట్ లాంటి రెండు పరికరాలను అభివృద్ధి చేసింది. సెన్సర్ల నెట్లు ఉన్న ఈ హెల్మెట్ పెట్టుకుంటే మెదడులో విద్యుత్ ప్రకంపనలు, రక్త ప్రవాహాన్ని వాయువేగంతో కొలవడంతోపాటు పూర్తిగా విశ్లేషిస్తుంది.
గంటల తరబడి ఆస్పత్రుల్లో ఉండాల్సిన అవసరం ఉండబోదు : కెర్నల్ సంస్థ సీఈవో జాన్సన్
కెర్నల్ సంస్థ సీఈవో జాన్సన్ మాట్లాడుతూ.... ఈ హెల్మెట్లను మెదడుపై పరిశోధన చేసే సంస్థలకు పంపిణీ చేయనున్నామన్నారు. ఈ పరిజ్ఞానం చాలా ఏళ్ల నుంచి అందుబాటులో ఉంది కానీ ఒక గది అంత పరిమాణంలో ఉండే ఖరీదైన యంత్రాల ద్వారా టెస్టులు చేస్తేనే ఇవన్నీ తెలిసేవని చెప్పారు. ఈ హెల్మెట్ ద్వారా రోగులు కూడా గంటల తరబడి ఆస్పత్రుల్లో ఉండాల్సిన అవసరం ఉండబోదని అన్నారు. ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఆసక్తి ఉంటే ఈ హెల్మెట్లను కొనుగోలు చేయవచ్చని వివరించారు.










