Sep 08,2023 17:09

భోపాల్‌ :   బిజెపి పాలిత ప్రాంతమైన మధ్యప్రదేశ్‌లో రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర విద్యుత్‌ సంస్థ (మధ్యప్రదేశ్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ ) మిగులు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ.. విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గృహాలకు కూడా విద్యుత్‌ కోతలు విధించడంతో రైతులు, స్థానికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ నెల మొదటి నాలుగు రోజుల్లోనే కొరత ఏర్పడటంతో రోజువారీ విద్యుత్‌ సరఫరా ఏడుగంటలకు పరిమితమైంది.

వర్షాభావంతో పాటు విద్యుత్‌ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖండ్వాలో సుఖ్రామ్‌ (30) అనే రైతు తన మూడు ఎకరాలోల పత్తి, సోయాబీన్‌ పంటలు వేశాడు. అయితే ఇటీవల వరదలకు అతని రెండు ఎద్దులు కొట్టుకుపోయాయి. నీరు లేక పంట ఎండిపోవడంతో రూ.4.5 లక్షల నష్టం ఏర్పడిందని అతని సోదరుడు చందు తెలిపారు. దీంతో ఈనెల 4న ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

వ్యవసాయ సాగుకు కేంద్రమైన మాల్వా- నిమార్‌ ప్రాంతంలోని అగర్‌ మాల్వా, బర్వానితో పాటు అనే క జిల్లాల్లో విద్యుత్‌ కోతలు విధిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌లను మార్చడంలో తీవ్ర జాప్యం, విద్యుత్‌ లైన్ల పునరుద్ధరణ చేపట్టకపోవడంపై మండిపడుతున్నారు. అధిక వేడి కారణంగా సోయాబీన్‌ పంట 50 శాతం నష్ట పోయిందని, విద్యుత్‌ కోతలతో పంట చేతికి వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. పలు జిల్లాల్లోని కలెక్టరేట్‌, తహసీల్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు.