Feb 20,2022 13:06

వైవిధ్యమైన కథలతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు తమిళ స్టార్‌హీరో విక్రమ్‌. అయితే గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తోన్న విక్రమ్‌కు 'మహాన్‌' కొత్త ఊపునిచ్చిందనే చెప్పొచ్చు. మద్యపాన నిషేధం అనే కథాంశంతో తెరకెక్కిన ఈ యాక్షన్‌ డ్రామా ప్రచార చిత్రాలు అభిమానుల్లో క్రేజ్‌ సొంతం చేసుకున్నాయి. మరోవైపు రియల్‌ లైఫ్‌లో తండ్రీకొడుకులైన విక్రమ్‌, ఆయన తనయుడు ధ్రువ్‌ చిత్రంలోనూ తండ్రీకొడుకులుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మరి అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకుందా? 'మహాన్‌' ప్రేక్షకుల్ని మెప్పించాడా? తెలుసుకుందాం..!

చిత్రం : మహాన్‌
నటీనటులు : విక్రమ్‌, ధ్రువ్‌ విక్రమ్‌, సనంత్‌, సిమ్రాన్‌, బాబీ సింహా, వాణీ భోజన్‌, ముత్తుకుమార్‌ తదితరులు
సంగీతం : సంతోషన్‌ నారాయణన్‌
ఎడిటింగ్‌ : వివేక్‌ హర్షన్‌
సినిమాటోగ్రఫీ : శ్రేయస్‌ కృష్ణ
కథ, కథనం, దర్శకత్వం: కార్తీక్‌ సుబ్బరాజ్‌
నిర్మాత : లలిత్‌కుమార్‌
నిర్మాణ సంస్థ : సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో
విడుదల తేదీ : 10-2-2021
ఓటీటీ : అమెజాన్‌ ప్రైమ్‌


కథలోకి వెళ్తే.. గాంధీమహాన్‌ (విక్రమ్‌) కామర్స్‌ లెక్చరర్‌. మహాన్‌ కుటుంబం తరతరాలుగా మద్యపాన నిషేధానికి పోరాటం చేసింది. అదే ఆదర్శాలతో మహాన్‌ పెరిగి, పెద్దవాడవుతాడు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించడం ద్వారా 40 ఏళ్ల చప్పటి జీవితంతో విసుగు చెందుతాడు. అతని భార్య నాచికు (సిమ్రాన్‌), కొడుకు దాదాబారు నౌరోజీ (ధ్రువ్‌ విక్రమ్‌) తిరుపతి వెళ్లడంతో రోజంతా ఇష్టం వచ్చినట్టు బతకాలని ఫిక్స్‌ అవుతాడు. స్నేహితులతో కలిసి, పార్టీ చేసుకుంటూ మద్యం సేవిస్తాడు. ఆ రోజు అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఈ విషయం అతని భార్య నాచికు తెలియడంతో వారి మధ్య గొడవలు వస్తాయి. దాంతో నాచి, కొడుకుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతుంది. మద్యానికి నెమ్మదిగా అలవాటుపడిన మహాన్‌.. కొద్ది కాలంలోనే మద్యం సిండికేట్‌కు లీడర్‌ అవుతాడు. తన స్నేహితుడు సత్యవాన్‌ (బాబీ సింహా) భాగస్వామ్యంతో మద్యం వ్యాపారిగా మారి, బిలియనీర్‌ అవుతాడు. కొన్నేళ్ల తరువాత, కొడుకు గాంధీ దాదా పోలీసు అధికారి అవుతాడు. మద్యం వ్యాపారాన్ని అరికట్టడానికి దాని సిండికేట్‌లో ఉన్న వ్యక్తులను చంపడానికి, ఒక మిషన్‌ను ప్రారంభిస్తాడు. ముఠాలోని ప్రతి ఒక్కరినీ చంపి, ఈ మద్యం వ్యాపారాన్ని ఆపుతానని దాదా గాంధీతో సవాల్‌ చేస్తాడు. గాంధీ తనకు ప్రాణంలాంటి స్నేహితుడి కోసమో లేక విడిపోయిన కొడుకు కోసమో నిలబడాల్సిన సంక్లిష్ట స్థితిలో నిలబడతాడు. ఆ సమయంలో గాంధీ ఎవరికి అండగా నిలబడ్డాడు? మద్యం అరికడతాను అన్న దాదా ఛాలెంజ్‌ నెరవేరుతుందా? దాదాబారు నౌరోజీకి మధ్య ఎలాంటి సంఘర్షణలు ఎదురయ్యాయి? వీరి మధ్య నడిచే పోరాటంలో ఎవరు పైచేయి సాధించారు అనేది కథ.
    రెండు బలమైన పాత్రల మధ్య సంఘర్షణలను ఎలా తీర్చిదిద్దారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అదీ తండ్రీకొడుకులు రెండు భిన్నమైన పాత్రల్లో ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఈ అంచనాలు అందుకోవడంలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ చాలావరకూ సఫలమయ్యాడు. గాంధేయవాదాలను పాటిస్తూ తరతరాలుగా మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాన్‌ కుటుంబం, అదే సిద్ధాంతాలను పాటిస్తూ మహాన్‌ ఎదగడం తదితర అంశాలతో సినిమా ప్రారంభించాడు. ఎప్పుడైతే మహాన్‌ తనకు నచ్చినట్టుగా బతకాలనుకున్నాడో అప్పుడే అసలు కథ మొదలవుతోంది. లిక్కర్‌ సిండికేట్‌కు నాయకుడిగా ఎదిగే క్రమంలో వచ్చే సన్నివేశాలు అభిమానుల్ని అలరిస్తాయి. అవన్నీ చకచకా సాగిపోతాయి.
   దాదాబాయ్ నౌరోజీ అలియాస్‌ దాదా కథలోకి రంగప్రవేశంతో కథపై మరింత ఆసక్తి ఏర్పడుతుంది. ద్వితీయార్థంలో ఒకటి రెండు ట్విస్టులు మినహా.. సినిమా అంతా ఒకే టెంపోలో సాగుతుంది. ప్రతి సన్నివేశంలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ మేకింగ్‌ స్టైల్‌ కనిపిస్తుంది. నిజానికి కొన్ని సీన్లలో తరువాత ఏం జరగనుంది? అనే విషయాన్ని ఏమాత్రం అంచనా వేయకుండా పకడ్బందీగా దర్శకుడు రాసుకున్న కథనం అమోఘం. అసలు సినిమా ఏమాత్రం ఊహించని విధంగా సాగిపోతూ ఉంటుంది.
   విలక్షణ పాత్రలను ఎంచుకునే విక్రమ్‌కు 'మహాన్‌' మంచి సక్సెస్‌ని అందించినట్లే.. ఈ కథకు మహాన్‌ పాత్రలో విక్రమ్‌ నూటికి నూరు శాతం ఒదిగిపోయాడు. తండ్రికి ధీటుగా ధ్రువ్‌ కూడా దాదా పాత్రలో చక్కని నటన కనబరిచాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికి ఆయువుపట్టు. సిమ్రాన్‌, బాబీ సింహా, తదితరులు తమ పాత్రల మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ శ్రేయస్‌కృష్ణ కెమెరా పనితనం మెప్పించేలా ఉంది. సంతోష్‌ నారాయణ్‌ అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. ఎడిటర్‌ వివేక్‌ హర్షన్‌ తన కత్తెరకు మరికాస్త పనిచెప్పి ఉండాల్సింది.