ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పాలకుల అధికారులపై ఉందని సిపిఎం జిల్లా నాయకులు గోవిందు, సిఐటియు నాయకులు రాముడు తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధి, ఎమ్మిగనూరు సమగ్రాభివృద్ధిని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 31 వరకు చేపట్టే మహాపాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. సోమవారం పట్టణంలోని కర్నూలు బైపాస్ రోడ్డు, తాయమ్మ కాలనీ, ముబారక్ నగర్, సున్నంబట్టి ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలను సిపిఎం పాదయాత్ర బృందానికి వివరించారు. రోడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బ్రిడ్జి లేకపోవడం వల్ల పై మాలగేరి ప్రైమరీ స్కూల్‌కు ధోబిఘాట్ వైపు నుంచి వచ్చే విద్యార్థులు మురికి నీళ్లలో నడుచుకుంటూ వస్తున్నారని చెప్పారు. ధోబిఘాట్ వద్ద వంతెన నిర్మించాలని కోరారు. ముబారక్ నగర్‌లో మట్టి రోడ్లు గుంతలమయమై ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తాయమ్మ కాలనీ, ముబారక్ నగర్‌లో డ్రెయినేజీ సౌకర్యం లేదని చెప్పారు. సిపిఎం జిల్లా నాయకులు గోవిందు మాట్లాడుతూ... పట్టణంలో రోజురోజుకు సమస్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. 34 ఏళ్లుగా ఉన్న సిసి రోడ్లు నేడు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి బడుగు, బలహీన వర్గాల వారు ఉండే ప్రాంతాల్లో సిసి రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుసంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య, రాజు, చంద్ర, రాముడు, దాదా, సుభాన్ పాల్గొన్నారు.
పాదయాత్ర నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు










