ప్రజాశక్తి - కొత్తచెరువు: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలతో కలిసి పల్లె నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని బిసి కాలనీలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 641 మంది ఇళ్లు లేని వారికి ప్లాట్లు కేటాయించామనాన్రు. అడవి లాగా ఉన్న ఆ ప్రాంతంలోని చెట్లు కొట్టించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తే వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా కనీసం విద్యుత్ స్తంభాలు వేయలేదని విమర్శించారు. ఫలితంగా బిసి కాలనీ మొత్తం చీకటిమయంగా మారిందన్నారు. సరైన డ్రయినేజీ లేక మురుగునీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండి దోమలకు నిలయంగా మారాయన్నారు. కాలనీలో కనీసం రోడ్లు కూడా వేయలేదన్నారు. నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో స్థానిక ఎమ్మెల్యే చెప్పాలని ప్రశ్నించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను తహశీల్దార్ రామాంజనేయరెడ్డి, ఎంపీడీవో సిద్ధారెడ్డికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఎస్ శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్ రామకృష్ణ, టౌన్ కన్వీనర్ వలిపి శ్రీనివాసులు, మాజీ సర్పంచి వెంకటరమణప్ప, మాణిక్యం బాబా తదితరులు పాల్గొన్నారు










