ప్రజాశక్తి-పాడేరు:గ్రామ సచివాలయాల సిబ్బంది సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. కార్యాలయాలకు ఆలస్యంగా హాజరు కావడం, ముందుగానే కార్యాలయాలకు తాళం వేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి 22 మండలాల ఎంపిడిఓలు, ఎంఇ ఓలు, ఉపాధి హామీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, ఆధార్ సీడింగ్, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల నిర్మాణాలు, మన బడి నాడు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముంచింగ్‌పుట్టు మండలం కిలగాడ, పెదబయలు మండలం పర్రెడ, జి.మాడుగుల మండలం సొలభం-1 గ్రామ సచివాలయాలను డిఎల్‌డిఓ తనిఖీకి వెళ్లినపుడు సాయంత్రం ఐదు గంటలకు ముందే కార్యాలయాలకు తాళం వేసి ఉందని సంబంధిత సచివాలయం సిబ్బందికి జీతాలు నిలుపుదల చేయాలని ఎంపిడిఓలను ఆదేశించారు. అటవీ హక్కు పత్రాలు కలిగిన గిరిజన రైతులకు ఉపాధి పనులు కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఉపాధి పనుల కల్పనలో మారేడుమిల్లి, జి.కె.వీధి, రంపచోడవరం, జి.మాడుగల మండలాలో వెనుకబడి ఉన్నారని పురోగతి సాధించాలని స్పష్టం చేసారు. ప్రతీ పంచాయతీలో ఉపాధి పనులు గుర్తిచాలని ఆదేశించారు. జిల్లాలో 20వేల వరకు చెరువులు ఉన్నాయని, పనులు గుర్తించి పెద్ద ఎత్తున ఉపాధి పనులు నిర్వహించాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో కిచెన్ గార్డెన్లు పెంచాలని సూచించారు. ఉపాధి కూలీలకు ఆధార్ సీడింగ్ చేయలన్నారు.మంజూరు చేసిన బర్త్ సర్టిఫికేట్లను వెంటనే లబ్దిదారులకు పంపిణీ చేయాలని చెప్పారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణపు పనుల బిల్లులు ఎక్కడా పెండింగ్ లేవన్నారు. ప్రాధన్యతా భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. భవనాలు లేని పాఠశాలల వివరాలను ఈనెల 21 వ తేదీలోపు సమర్పిస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. మన బడి నాడు నేడు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటిడిఏ పిఓ వి. అభిషేక్, రంపచోడవరం పి ఓ సూరజ్ గనోరే, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, డివిజనల్ పంచాయతీ అధికారి పి. ఎస్. కుమార్, డిఎల్‌డిఓ శాంతలక్ష్మి, ఉపాధి హామీ ఎపిడి జె.గిరిబాబు, డిబిటి మేనేజర్ నరేష్, 22 మండలాల ఎంపిడి ఓలు, ఎంఇఓలు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.










