చిలమత్తూరు : శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల కేంద్రంలో పేదలకు ఈ నెల 21వ తేదీన ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు మాట తప్పారు. దీంతో పేదలు సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో మళ్లీ పోరుబాట పట్టారు. సర్వే నెంబర్ 805లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ పేదలు సిపిఎం ఆధ్వర్యంలో పది రోజుల క్రితం భూస్వాధీన పోరాటం నిర్వహించారు. ఈ సమయంలో వారి వద్దకొచ్చి 21వ తేదీన అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని తహశీల్దార్ నాగరాజు హామీ ఇచ్చారు. 21వ తేదీ దాటినా దీని గురించి పట్టించుకోకపోవడంతో సోమవారం నాడు మళ్లీ అదే భూమిలో పేదలు భూస్వాధీన పోరాటం నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈఎస్.వెంకటేష్, వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కోడూరు పొలం సర్వే నెంబర్ 805లోనే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. ఇళ్ల స్థలాల కోసం మళ్లీ భూ స్వాధీన పోరాటం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఈ ఆందోళన ఉధతం చేస్తామన్నారు. మూడేళ్లుగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులకు చేతులు రాకపోవడం దుర్మార్గం అన్నారు. లబ్ధిదారులుగా గుర్తించిన వారందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.










