'మాట పరిమళించు మల్లెపూ రీతిగ
మాట చీల్చు గుండె ఈటెవోలె
మాట నేర్పుతోనె మనుజుండు రాణించు
పొల్లు మాటగాడు చెల్లడెపుడు'' అంటూ ఎక్కడో ఓ అజ్ఞాత కవి రాసిన పద్యం గుర్తుకొస్తుంది, ప్రముఖ కవి చిన్ని నారాయణరావు రాసిన మాట దీర్ఘ కవిత చదువుతుంటే. ఈ దీర్ఘ కవిత 'మాట' ప్రాశస్త్యానికి మణిదీపంగా భావించవచ్చు. ప్రపంచంలో అన్ని రంగాల్లో మాటే మహౌన్నతమైన, శక్తివంతమైన ధాతువు. జ్ఞాన సంపన్నంగా అభ్యుదయాన్ని ఆరవోసే అర్ధవంతమైన మాట, సమాజంలో మేటిగా రాణిస్తుంటూంది. అనృతాలను మోసే మాట, పాలకుల నోటి నుంచి వచ్చినా, పాలితుల మోవి నుంచి జాలువారినా, సర్వసంఘ పరిత్యాగుల ప్రవచనాల నుంచి దొర్లినా అనర్థాలకు దారి తీస్తుంది, మనిషితనానికి మచ్చగా మిగిలిపోతుంది. నిజం చెప్పాలంటే మాట, చరిత్రకు దర్పణం, సమాజస్థితికి ప్రతిబింబం.
'మాట' శీర్షికతో మహౌన్నతమైన దీర్ఘ కవితను రాసిన చిన్ని నారాయణరావు నేటి సామాజిక స్థితిగతుల్ని పాఠకుల కళ్ళకు కట్టాడు. 'మాట'ను చదువుతుంటే కవి, ఎంత బాధ్యతాయుతంగా, నిష్ఠగా, నిర్మొహమాటంగా, చైతన్యవంతంగా నడుస్తున్న సమాజంతో తలము నకలై ఎంతో పరిశీలనా దృష్టితో కవిత్వమై ప్రవహించాడనిపిస్తూంది. ఈయన వృత్తిరీత్యా ఆడిటర్. వ్యక్తుల, సమస్థల ఆర్ధిక గణాంకాలను సరిదిద్దడం తన పని. ప్రవత్తిరీత్యా కవి గనుక సామాజిక విధ్వంసక మూలాల గణాంకాలను పసిగట్టి సద్గుణాంకాలుగా తీర్చిదిద్దే చైతన్యాన్ని కలిగించడం చేస్తుంటాడు. మాటను గురించి రాయడమంటే సమాజాన్ని విలక్షణమైన, విభిన్నమైన, అనేకానేక కోణాల్లో దర్శిస్తూ అనుభవాలను ఆత్మావలోకనం చేసుకుంటూ, అనుభూతులను అక్షరబద్ధం చేయడమే! 'మాటంటే... మాటలు కాదు/ మాటకు మనసుంటుంది/ అంతర్లీనంగా వ్యక్తులతో మమేకమవుతుంది/... సహస్ర బాహువుల్తో వాటేసుకుంటుంది... మనిషిపై చెరగని ముద్ర వేస్తుంది' అంటూ మాటకున్న విశిష్ట స్థానాన్ని ఎత్తి చూపాడు కవి. మాటను ఒక అంతులేని తపస్సుగా, గురిపెట్టిన ధనస్సుగా, మనిషిని మనిషిగా నిల్పే యశస్సుగా పేర్కొన్నాడు. సరైన మాట బీజమై, తేజమై హృదయాంతరాళాల్లోకి పాకుతుంది. మహౌన్నత శక్తిసంపన్నమై, అనంత ద్ణుఖ సాగరాల్ని దాటి, అశేష తమోతీరాల్ని మీటి, కర్తవ్య నిర్వహణార్చనా యజ్ఞంలో ప్రథమ సమిధలుగా దృగ్గోచరమవుతాయి... అంటాడు కవి.
'మాట' శక్తిని గురించి చెప్తూ 'మాట చురకత్తి లాంటిది / అది మనసును నిట్టనిలువునా వధిస్తుంది/ మాట మనసుల్ని దోచే పాటవుతుంది/ మాట మనిషికి జై కొడుతుంది/ లేదంటే ఛీ కొడుతుంది. ఒక్కోసారి దుర్మార్గాన్ని ఢ కొడుతుంది, మాట మిత్రునిలా తోడునిస్తుంది.. మనలోని ఔన్నత్యానికి ప్రతీకగా, సమున్నత వ్యక్తిత్వానికి పరాకాష్టగా, వైతాళిక గీతమై పోతుంటూంది. 'మాట' ఎట్లావుండాలి అనేది కవి ఎంతో సూక్ష్మంగా చెప్తూ 'మాటంటే మనిషి నడవడిక, మనసుతో ఒడంబడిక, మాటంటే డాక్యుమెంటుగా, మాన్యుమెంటుగా మిగలాలి' అంటాడు. మహాజ్ఞానులు 'విరాట్ పోతులూరి వీరబ్రహ్మం/ కాలజ్ఞానం / మహత్తర మాటల సంగమమే కదా / ఏసుక్రీస్తు మానవతా సందేశం / మాటల వనంలో విరిసిన సౌగంధమే కదా!' అంటారు. 'బాపూజీ పిలుపు చేతనమయ్యే కదా / భారతావని స్వాతంత్య్ర సౌరభాలు / విరజిమ్మింది / అమరజీవి నినదించిన మాటలు / బాటలయ్యే కదా / భాషా ప్రయుక్త రాష్ట్రాల కోటలయ్యింది / అల్లూరి మాట భరోసాతోనే కదా / మన్యం వైప్లవ్యగీతికగా మారింది' అంటారు. మాటలో అద్భుతమైన ఔషధశక్తి ఉందని ఉద్ఘాటించిన కవి చిన్ని నారాయణ 'మాట ఔషధ గుణం సంతరించుకొన్న / అద్భుతశక్తికి నెలువెత్తు దర్పణం / మనసు గాయాల్ని మాన్పే దివ్యఔషధం / మనిషికి శక్తి సంపన్నతనిస్తుంది / మనిషి లక్ష్యం నెరవేరుస్తుంది / మాట మనిషికి విజయ సోపానం / సరికొత్త దీప్తికి పునాది / మనోభావ వీచిక / సంస్కార కరదీపిక' అంటూ మాట ఔన్నత్యాన్ని వివరించారు.
'మాట చుక్కాని అయితే సంఘం సర్వసన్నద్ధమై సారవంతమైన నడక నడుస్తుంది. ఎటుచూసినా సుభిక్షం చోటు చేసుకొంటుంది. మాటలు దఢచిత్తాలై పని సామర్ధ్యానికి ప్రతీకలవుతాయి. మాటే మనిషిని అనునిత్యం కాపాడే రక్షణ కవచం' అంటూ మాట తన గతిని తప్పితే 'మాట జారితే / మనిషే మసకబారుతాడని / చరిత్రహీనులవుతారని / మసియైపోతారని' హెచ్చరిస్తాడు కవి. 'మాటలంటే / ఆలోచనల ఊటలు / మనిషికి పెట్టని కోటలు / అంతరంగాన్ని వెలిగించే చిరుదీపాలు / మనిషిని కదిలించే పర్జన్యం / మాటే మనిషికి కమనీయం బతుక్కి రమణీయం' అంటాడు కవి.
ఈ 'మాట' దీర్ఘ కవితను 18 భాగాలుగా, భారతంలోని పర్వాలు లాగా ఎంతో విలువైన సమాచారాన్ని ఏర్చి కూర్చి రాశాడు కవి. 'మాట' కావ్యం, వో మంత్ర జాలంగా పాఠకుణ్ణి తన వెంట నడిపించుకుంటుంది. వేగుచుక్కలా చైతన్యదీప్తితో మాటలాడే వ్యక్తిత్వాన్ని పెంచే వక్తృత్వాన్ని అందిస్తుంది. పాఠకుణ్ణి వో భావనా భరితమైన తూగుటూయల మీద ఊగిస్తుంది. అంతరంగంలో ఆనందపు పూలు పూయిస్తుంది. ఈ దీర్ఘ కవిత చదివితే మనిషి జీవన పార్శ్యాలను తేలిగ్గా అవగాహనించుకోవచ్చుననడం సత్యదూరమైన వాక్యం కాదు. 'చిన్ని' పదం ఈ కవి పేరులో వున్నా ఈయనెక్కడ చిన్ని! ప్రజ్ఞాపాటవాలు కల్గిన, పరిశీలనాశక్తి గల, పరిపక్వత పండిన పేరెన్నికగన్న కవిగా నారాయణరావు నిలుస్తాడు. కె.శివారెడ్డి, కీ.శే అద్దేపల్లి చెప్పినట్లు 'మాట'పై ఇంత విస్తృతంగా తెలుగు సాహిత్యంలో మొదటిసారి రాసిన వ్యక్తి చిన్ని నారాయణరావు కావడం మరింత అభినందనీయం.
- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి,
99487 74243










