Aug 18,2023 21:45

రోటరీ సభ్యులకు ప్రశంసాపత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌, రెడ్‌ క్రాస్‌ అధ్యక్షులు నిశాంత్‌ కుమార్‌ అన్నారు. మారుమూల గ్రామాల్లో వైద్య సేవల ఆవశ్యకత ఉందని, ప్రణాళికా బద్ధంగా షెడ్యూలు తయారు చేసి వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. జిల్లా రెడ్‌ క్రాస్‌ సర్వ సభ్య సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సమావేశాన్ని కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థాపించించిన ఏడాదిలోనే మంచి కార్యక్రమాలు నిర్వహించారని అభినందించారు. రెడ్‌ క్రాస్‌ భవనం నిర్మించేందుకు స్థలం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని, భవన నిర్మాణానికి నిధులు సేకరించాలని సూచించారు. వైద్య శిబిరాలు నిర్వహించేందు జిల్లా యంత్రాంగం నుండి రూ.3లక్షలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నుండి లక్ష రూపాయల సమకూర్చుతామని చెప్పారు. రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ డా.ఎం.శ్రీరాములు మాట్లాడుతూ 13 నెలల కాలంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో మెగా మెడికల్‌ క్యాంపులు నిర్వహించామని, 10మంది వివిధ అధ్యాపక వైద్యులు తమ సేవలను అందించారని తెలిపారు. రూ.60వేలు విలువైన మందులను ఉచితంగా అందజేశామన్నారు. నిరుపేదలకు హైజీనిక్‌ కిట్లను, గిరిజనులకు 150 జతల కొత్త బట్టలు పంపిణీ చేశామని వివరించారు. వివిధ శిబిరాల్లో రక్త యూనిట్లను సేకరించి గర్భిణులు, డయాలసిస్‌ పేషెంట్లు, టైఫాయిడ్‌, మలేరియా రోగులు, యాక్సిడెంట్‌ పేషెంట్లు తదితరులకు అందించామని చెప్పారు. పేదలకు 4430 ఉచిత పౌష్టికాహార భోజన ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు. సభ్యత్వ రుసుంగా రూ.1,38,600 సేకరించామని, జగదీశ్వరరావు 42 మంది సభ్యులను చేర్పించారని, బోటు రామకష్ణ 38 మంది సభ్యులను చేర్పించారని చెప్పారు. ఈ సందర్భంగా బి.జయబాబు, బి. నాగభూషణరావు భవన నిర్మాణానికి రూ.లక్ష చొప్పున విరాళంగా అందిస్తామని ప్రకటించారు. ఉత్తమ సేవలు అందించిన వైద్యులు డి.రవీంద్రరావు, వై.వివేక్‌, ఎన్‌.దుర్గాప్రసాద్‌, స్వరూప్‌, వై.ధీరజ్‌, కె.శ్రీరేఖ, కె.రాజీవ్‌, వై.రజనీ ప్రియ, ఎం. సుబ్రమణ్యం, జి.ప్రభాకర్‌ రావు, 96 సార్లు రక్త దానం చేయడమే కాకుండా 2,500 మందిని రక్త దానం కోసం ప్రేరేపించడం, ఎక్కువ మందిని సభ్యులుగా నమోదు చేసిన బోటు రామకష్ణ, సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొన్నా తాడి రమేష్‌ తదితరులను సత్కరించారు. రెడ్‌ క్రాస్‌కు మంచి ప్రోత్సాహమిస్తున్న జిల్లా కలెక్టర్‌ను సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాధ రావు, సభ్యులు పాల్గొన్నారు.
కొండలరావు పలువురు అభినందనలు
గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురానికి చెందిన పైడా కొండలరావు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు. రెడ్‌ క్రాస్‌ సంస్థలో చేరిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు మంచి సేవలందించారని కొనియాడారు. ఇందుకు గాను సేవలను గుర్తించిన జిల్లా కలెక్టర్‌, రెడ్‌ క్రాస్‌ సంస్థ ప్రెసిడెంట్‌ నిశాంత్‌ కుమార్‌ బెస్టు ఆర్గనైజర్‌ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం ప్రజలు కొండలరావును అభినందించారు.