అనంతపురం ప్రతినిధి : ఎవరికెన్ని మార్కెలొచ్చాయోనన్న గుబులు జిల్లా నేతల్లో నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి నేడు ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాన్ని అమరావతిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. ఇప్పటికే నేతలు తరలివెళ్లారు. ఈ సమావేశంలో ప్రొగ్రెస్ రిపోర్టులపైనా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరికెన్ని మార్కులొచ్చాయన్నది గుబులు నేతల్లో నెలకొంది. కొంత మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్రమైన అసంతృప్తులున్నట్టు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ సమాచారం నిఘా వర్గాలు, సర్వే బృందాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి వద్ద ఉన్నట్టు సమాచారం. ఎక్కువ ఆరోపణలున్న వారిని ఇది వరకే ఆయన కొన్ని హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది. అయినా నేతల్లో మార్పు లేదన్న ఆరోపణలున్నాయి. తమకు మరోమారు అవకాశం వస్తుందో రాదోనన్న ఉద్ధేశంతో ఉన్నంతలో చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు కార్యక్రమాన్ని సైతం కొంత మంది నాయకులు మొక్కుబడిగానే ముగించారు. ఇప్పటికీ ఇంకా పూర్తి చేయని వారున్నారు. వీటన్నింటి ఆధారంగానే నేతల పనితీరుపై ప్రొగ్రెగ్ రిపోర్టులు తయారీ చేసినట్టు తెలుస్తోంది. వీటి గురించి నేడు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశామున్నట్టు పార్టీ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. ప్రొగ్రెసు రిపోర్టు సరిగా లేని వారిపై రాబోయే రోజుల్లో వేటు పడే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే కొంత మందికి వచ్చే ఎన్నికల్లో అవకాశం లేదన్న సంకేతాలను పార్టీ అధిష్టానం నుంచి ఇచ్చియున్నారు. ఈ సమావేశంలో దీనిపై మరింత స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో వైసిపి బలీయంగానే ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 14 అసెంబ్లి నియోజకవర్గాలకుగానూ 12 వాటిల్లో గెలుపొందింది. ఉరవకొండ, హిందూపురం మాత్రమే ఓటమి చెందింది. రెండు పార్లమెంటు స్థానాల్లోనూ వైసిపినే విజయం సాధించింది. ఇవే ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ రాబట్టేందుకు ఆ పార్టీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలోనూ అత్యధిక స్థానాల్లో ఇప్పుడున్న నేతలను మారుస్తారన్న ప్రచారమూ సాగుతోంది. కొన్ని చోట్ల ఇప్పటికే కొత్తవారు తెరపైకి వస్తున్నారు. ఇక ఎన్నికల సమయానికి ఎటువంటి మార్పులు జరుగనున్నాయన్నది ఆ పార్టీల చర్చ నడుస్తోంది. తమకు తప్పకుండా సీటు ఉంటుందన్న ధీమాను ఏ ఒక్క నేతా వ్యక్తం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఎటువంటి మార్పులు తీసుకొస్తారోనన్ని గుబులు చెందుతున్నారు. నేడు జరిగే సమీక్ష సమావేశంలో వచ్చే ప్రొగ్రెస్ రిపోర్టుతో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి తమ భవిష్యత్ రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతోందన్న అంచనాకు నేతలు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి చేపట్టిన సమీక్ష సమావేశం జిల్లా నేతల్లో గుబులు రేపుతుండటం గమనార్హం.










