ప్రజాశక్తి-ముంచింగిపుట్టు మండలంలో అతి మారుమూల ప్రాంతమైన దోడిపుట్టు పంచాయతీ బిడిచంప గ్రామంలో గర్భిణీని సుమారు ఏడు కిలోమీటర్లు డోలిలో తరలించిన వైనం ఆదివారం చోటుచేసుకుంది. పాంగి చిలకమ్మ రెండు రోజుల నుండి పురిటి నొప్పులతో బాధపడుతుంది. రోడ్డు సౌకర్యం లేక, ప్రభుత్వాసుపత్రికి తరలించలేక సతమతానికి గురయ్యారు. 108 వాహనానికి సంప్రదించినప్పటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రాలేని పరిస్థితి నెలకొంది.గర్భిణీ పాంగి చిలకమ్మా ప్రాణాపాయానికి గురవుతుందని భయాందోళన చెంది కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మోసుకు వెళ్తున్న తరుణంలో బీడి చంప, కుమ్మికుట్టు మార్గం మధ్యలో మగ బిడ్డని జన్మనిచ్చింది. జన్మనిచ్చిన బిడ్డను తల్లిని అక్కడి నుండి లడ్డు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మళ్లీ డోలిమోతలోని మోసుకుని వెళ్ళవలసిన దుస్థితి నెలకొంది. ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అనంతరం తల్లీ బిడ్డలను డోలీలోనే కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో మోసి తీసుకువెళ్లారు.
ఇదిలా ఉండగా కుమ్మి గూడ పిఆర్ రోడ్డు నుండి బిదిచంప వరకు ఏడు కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, ఆయా సమీపంలో మూడు బ్రిడ్జిలను నిర్మాణ పనులు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు, బ్రిడ్జిల్ల నిర్మాణాలు చేపట్టాలని బీడు చంప గ్రామస్తులు పాంగి రాజు, పాంగి దశరథ్, పాంగి కామేష్, పాంగి భీమేష్ పాంగి దేవదాస్, పాంగి పలుసు కోరారు.










