ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మానవత్వంతో బతకడం ఓ గొప్పవరమని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు శంకరయ్య తెలిపారు. శుక్రవారం పద్మశాలి కళ్యాణ మండపంలో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 'సనాతన ధర్మంపై నేడున్న పరిస్థితుల'పై చర్చ గోష్టి నిర్వహించారు. జెవివి నాయకులు శంకరయ్య, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు రాఘవేంద్ర అధ్యక్షత వహించారు. చర్చ గోష్టిలో మొదటిగా జమాతే ఇస్లాం నాయకులు అమీర్ మాట్లాడుతూ... దేశంలో మతం పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెట్టడం వల్ల హింస పెరిగిపోతోందని చెప్పారు. జెవివి నాయకులు చాంద్ బాష మాట్లాడుతూ... ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు మానవుని మంచినే కోరుకుంటాయని తెలిపారు. కులాలు, మతాలు ప్రజలు కలిసి జీవించడానికి తోడ్పడాలే తప్ప అభివృద్ధిని అడ్డుకోవడానికి కాదని పేర్కొన్నారు. దేశంలో సనాతన ధర్మం పేరుతో ప్రజల మధ్య అసహనం పెరగడం ప్రమాదకరమన్నారు. పేదరికం, నిరుద్యోగం పరిష్కరించాలంటే మత గోడల అడ్డును తొలగించుకొని శాస్త్రీయ ఆలోచనతో దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మాల మహానాడు నాయకులు హుస్సేన్ మాట్లాడుతూ... హిందుత్వం పేరుతో ప్రజల మధ్య గొడవలు పెట్టడం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ మానుకోవాలన్నారు. కులాల వర్గీకరణ పేరుతో కూడా దేశంలో ఉన్న కొన్ని శక్తులు ప్రయత్నించడం బాధాకరమని తెలిపారు. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్.దేవసహాయం మాట్లాడుతూ... సనాతనం వేరు, ధర్మం వేరు అన్నారు. సంస్కృతి, ఆచారాలు, పెళ్లిళ్లు ప్రాంతాలను బట్టి భాషలు, అన్ని విషయాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.నాగమణి మాట్లాడుతూ... నేడు పాలకులు మహిళల గౌరవాన్ని వదిలేసి వ్యాపార వస్తువులుగా చూస్తున్నారని తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, ఆమె గిరిజన తెగకు చెందిన వారని, వితంతువురాలని అవమానించడం బాధాకరని చెప్పారు. జెవివి నాయకులు నారాయణ మాట్లాడుతూ... దేశాభివృద్ధికి ప్రధానంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి కావాలన్నారు. నేడున్న ప్రభుత్వాలు ప్రజా ఆకర్షణ పథకాలను చూపి ఓట్లు దండుకుంటున్నాయని విమర్శించారు. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం సమన్వయ కర్త బి.రామాంజనేయులు, వృత్తి సంఘాల నాయకులు పి.గోవిందు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప, నాయకులు ప్రసాద్, మల్లారి నాగరాజు, కౌలన్న, రైతు సంఘం నాయకులు హనుమంతు, లక్ష్మీనరసయ్య, కార్మిక సంఘం నాయకులు రాముడు, యువజన సంఘం నాయకులు సురేష్, అజిత్, ప్రజాసంఘాల నాయకులు సుభాన్, రవి, నరసింహులు, వెంకటయ్య పాల్గొన్నారు.
చర్చ గోష్టిలో మాట్లాడుతున్న నాయకులు










