Sep 21,2023 21:18

గురజాడ విగ్రహానికి పూలమాల వేస్తున్న సాహితీవేత్తలు

పార్వతీపురం రూరల్‌: మనిషిని ప్రేమించడం తన మతంగా చెప్పుకున్న మానవతా మూర్తి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్నేహ కళా సాహితి, సాహితీ లహరి సభ్యులు ప్రముఖ రచయిత గంటేడ గౌరినాయుడు, మంచిపల్లి శ్రీరాములు, సభ్యులు స్థానిక జిల్లా కేంద్రాసుపత్రి కూడలిలో గల మహాకవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తన కార్యకర్తలతో కలిసి గురజాడకు పూలమాలలతో నివాళులు అర్పించారు. అలాగే మండలంలోని డోకిసీల గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం గోవిందరావు గురజాడ చిత్రపటానికి విద్యార్థులతో కలిసి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురజాడ గురించి పలువురు సాహితీ అభిమానులు రచయితలు, కవులు కళాకారులు మాట్లాడారు. కార్యక్రమంలో మళ్లీపురం జగదీష్‌, పక్కి రవీంద్రనాథ్‌, చిత్రకారుడు గోరా, సిరికి స్వామి నాయుడు, గడగమ్మ, రామకష్ణ, నాగు కాకిముక్కల, పలువురు సాహితీ అభిమానులు పాల్గొన్నారు. పార్వతీపురంటౌన్‌ : వాడుక భాషలో మొట్టమొదటి కవిత్వం రాసిన మహాకవి గురజాడ అప్పారావు అని ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి అన్నారు. గురజాడ అప్పారావు జయంతి ఐద్వా, సిఐటియు ఆధ్వర్యాన పట్టణంలోని వివేకనంద కాలనీ, ఉజ్జిడితల్లివీధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో గౌరమ్మ, జయలక్ష్శి, గౌతమి, మహిళలు పాల్గొన్నారు.
వీరఘట్టం: మండలంలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్మి గ్రామఎంపిపి పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్వహించి దేశభక్తి గేయాన్ని ఆలపించారు. గుమ్మలక్ష్మీపురం: తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, కన్యాశుల్కం నాటక రచయిత, అభ్యుదయ కవితా పితామహుడు, కవి శేఖర బిరుదాంకితుడు మహాకవి గురజాడ అప్పారావు అడుగుజాడల్లో ప్రతి ఒక్క విద్యార్థి నడవాలని దిగువ మండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పాలక దేవానంద్‌ కోరారు. గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా పాఠశాలలో ఆయన చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుబ్బారావు, విద్యార్థులు పాల్గొన్నారు. కొమరాడ : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురజాడ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్‌ వై.నాగేశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలవసి నివాళులర్పించారు. తెలుగుజాతి ఖ్యాతిని పెంచిన వ్యక్తి గురజాడని అన్నారు. సమాజాన్ని మార్చేందుకు గురజాడ తన కవిత్వాలు రచనలతో ప్రజలను మార్చిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు ఉద్యోగులు పాల్గొన్నారు. సీతంపేట : స్థానిక బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.లిల్లీరాణి గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లుర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.