Aug 24,2023 20:19

సెమినార్‌లో మాట్లాడుతున్న ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌

ప్రజాశక్తి-ఆలూరు
మానవ మనుగడకు విద్య చాలా అవసరమని ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ తెలిపారు. గురువారం ఆలూరు మోడల్‌ స్కూల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు పోతురాజు అధ్యక్షతన 'విద్యా ప్రాముఖ్యత - విద్యా నిర్లక్ష్యం చేయడం ద్వారా కలిగే నష్టాలు' అనే అంశంపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు సెమినార్‌ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఆలూరు ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శంకర్‌ ప్రసాద్‌, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ వీరేష్‌ హాజరై మాట్లాడారు. విద్య అంటే బోధన, నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యాసనల సమీకరణమని, విశాలమైన భావంలో పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడమని తెలిపారు. విద్య ప్రాథమిక ఉద్దేశం మానవునిలో దాగి ఉన్న అంతర జ్ఞానాన్ని వెలికి తీయడమని చెప్పారు. ఓ సమాజం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే, లేదా అభివృద్ధి చెందాలంటే విద్య అత్యవసరమని తెలిపారు. బలహీనతల నుంచి సమాజాన్ని రక్షించాలంటే కేవలం విద్య మాత్రమే మార్గమని చెప్పారు. మనిషి బతకడానికి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం చేస్తాడని, విద్య వల్ల ఈ మూడింటినీ సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని తెలిపారు. రైతులకు విద్య తోడైతే వ్యవసాయంలో అద్భుతంగా రాణించవచ్చని చెప్పారు. ధైర్యం, స్వశక్తిపై నమ్మకం ఉన్నవారు, వ్యాపారం చేసుకొనే వారికి విద్య అండగా ఉంటుందని తెలిపారు. ఇక ఉద్యోగం అనేది అతి హీన పరిస్థితుల్లో తినడానికి లోటు లేకుండా చేసుకొనే పనిగా చెప్పవచ్చని అన్నారు. చదువుకు, సంపాదనకు సంబంధం లేదని, సంపాదనకు కావాల్సింది తెలివితేటలని, చదువు లేనివారు సైతం రూ.కోట్లు సంపాదిస్తున్నారని తెఇపారు. పదిమందికి జీతాలిచ్చే ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయినా కనీసం నెలజీతం తీసుకొనే అవకాశం విద్య వల్ల దక్కుతుందని విద్యార్థులు కచ్చితంగా గ్రహించాలని సూచించారు. విద్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు దౌర్భాగ్యంగా ఉంటుందని తెలిపారు. మోడల్‌ స్కూల్‌ అధ్యాపకులు బాలకృష్ణ, సద్గురు, మంజుల, కల్పన, డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి మైనా, ఉపాధ్యక్షులు గోవర్ధన్‌, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, మండల నాయకులు గిరి మూర్తి, ఉలిరాజు, ధనుంజయ పాల్గొన్నారు.