Aug 25,2023 19:51

రిబ్బన్‌ కట్‌ చేస్తున్న రూరల్‌ సిఐ మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
శారీరక, మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలని రూరల్‌ సిఐ మోహన్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక వీవర్స్‌ కాలనీ మైదానంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. రూరల్‌ సిఐ మోహన్‌ రెడ్డి, యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు కె.సురేష్‌ కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.నాగమణి, జిల్లా అధ్యక్షులు జె.ఎల్లప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్‌ కుమార్‌ మాట్లాడారు. ఉపాధ్యాయులు ప్రస్తుతం చాలా ఒత్తిడికి గురవుతున్నారని, ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఆటలు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ పరిస్థితి ఏర్పడటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం కనుమరుగు అవుతోందని పేర్కొన్నారు. పేదపిల్లలను చదువుకు దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని, ప్రభుత్వ విద్యారంగం ప్రయివేట్‌ పరం కాకుండా కాపాడుకోవాలని కోరారు. మొదటి మ్యాచ్‌ కోసిగి, పెద్దకడబూరు జట్ల మధ్య సాగింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి పెద్దకడబూరు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 10 ఓవర్లలో 139 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోసిగి జట్టు 84 పరుగులు మాత్రమే చేసింది. యుటిఎఫ్‌ నాయకులు దావీద్‌, దేవపాల్‌, నరసింహులు, మల్లారి నాగరాజు, కౌలన్న, ఎం.రాజు, వై.రామాంజనేయులు, రవికుమార్‌, విజరు కుమార్‌, నల్లారెడ్డి, ప్రసాద్‌, జి.బాబు, చంద్రపాల్‌, పాపయ్య, భాస్కర్‌, శాంతిరాజు, శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సురేష్‌ కుమార్‌
సమావేశంలో మాట్లాడుతున్న సురేష్‌ కుమార్‌