అనంతపురం ప్రతినిధి : పోలీసు అధికారిగానున్న ఆ ఎంపీ ఉన్నఫలంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పోటీ చేసిన మొదటి సారే ఎంపీగా కూడా గెలిచారు. పోలీసు అధికారిగానున్న సమయంలోనూ ఆయన చుట్టూ అనేక వివాదాలున్నప్పటికీ ఏదో రకంగా నెట్టుకొస్తూ వచ్చారు. అయితే ఎంపీ అయిన తరువాత చుట్టుముట్టిన వివాదం ఆయన మొత్తం జీవితాన్నే దెబ్బకొట్టేసిందా అన్నట్టుగా మారింది. మహిళతో నగంగా వీడియో మాట్లాడారంటూ సోషియల్ మీడియాలో సాగిన ప్రచారంతో ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. ఆ వీడియోపై పెద్ద దుమారమే రేగి, తరువాత చల్లారినప్పటికీ ఆయనకు మాత్రం మాయని మచ్చగానే మిగిలింది. అప్పటి నుంచి ఆయన రాజకీయంగానూ అంత క్రీయాశీలకంగా కనిపించడం లేదన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి తదితరులు ముఖ్యమైన నాయకులు వచ్చినప్పుడు తప్పా తక్కినప్పుడు ఎక్కడా ఆయన కనిపించడం లేదు. పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల సమీక్షల్లోనూ ఆయన ఆచూకీ లేదనే చెప్పాలి.
అభివృద్ధిలో కనిపించని ముద్ర
హిందూపురం పార్లమెంటు సభ్యులుగానున్న గోరంట్ల మాధవ్ తన నియోజకవర్గం పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర కనిపించలేదన్న విమర్శలున్నాయి. కేంద్రం ద్వారా వచ్చే నిధులతో చేపట్టే కార్యక్రమాలు అనేకముంటాయి. వాటిని సాధించేందుకు ఆయన పెట్టిన కృషి ఏమిటన్నది తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు ధర్మవరం, హిందూపురం, సోమందేపల్లి ప్రాంతాల్లో చేనేత పరిశ్రమ విరివిగా ఉంది. ఈ పరిశ్రమకు కేంద్రం ఊతమిస్తోంది. అక్కడి నుంచి ప్రత్యేకమైన నిధులు రాబట్టలేకపోయారన్న విమర్శలున్నాయి. అదే విధంగా ఈ ప్రాంతంలోనే పట్టు పరిశ్రమ ఉంది. ఈ పట్టు రైతులకు, రీలర్లకు రావాల్సిన రాయితీలు రాలేదు. దీనిపైనా ఆయన స్పందించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇక రైల్వేకు సంబంధించి కొత్త ప్రాజెక్టు ఏఒక్కటీ ఈ నాలుగేళ్లలో సాధించలేకపోయారు. ఇక కేంద్ర సంస్థలైన నాసన్, బెల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాటి కోసం ఆయన కృషి చేసింది శూన్యమేనని ఆ ప్రాంతవాసులు విమర్శిస్తున్నారు.
ఈసారీ అవకాశం లేనట్టేనా ?
మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల అన్వేషణ మొదలుపెట్టాయి. వైసిపి కూడా ఎవరైతే సరిపోతారన్న దానిపై దృష్టి సారించిందనే చర్చ సైతం నడుస్తోంది. అయితే మాధవ్‌కు ఈసారి అవకాశం దాదాపుగా లేదనే ప్రచారమే సాగుతోంది. దీంతో కొత్తగా టిక్కెట్టు ఆశించే వారు సైతం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యమైన నాయకులను, ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులను కలువడం, తమకు అవకాశం కల్పించాలన్న విజ్ఞాపనలను సైతం అందజేస్తున్నారు. అయితే మొదట అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించిన నేతలు పార్లమెంటు సభ్యులపై ఇంకా అంత సీరియస్‌గా దృష్టి సారించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.










