ప్రజాశక్తి - పార్వతీపురం : మాదకద్రవ్యాల బారినుంచి సమాజాన్ని కాపాడి, మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు కె.కవిత తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటిడిఎ గిరిమిత్ర భవనంలో మత్తు పదార్థాల వినియోగం తగ్గింపు, విముక్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో మాదకద్రవ్యాలు సమాజం, యువత, ఆర్థిక వ్యవస్థలపై చూపే ప్రభావంపై అవగాహన, మాదకద్రవ్యాలు, చెడు ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించడంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఎడి కవిత మాట్లాడుతూ నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో మాదక ద్రవ్యాలు ఒకటని, యువతను వాటి బారిన పడకుండా కాపాడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుకుగాను ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి, డ్రగ్స్ ప్రభావిత జిల్లాల్లో ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. డగ్స్ వాడకం వల్ల యువత నిర్వీర్యమై దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందన్నారు. కావున డ్రగ్స్బారిన పడకుండా విద్యార్థులు, యువతను కాపాడాలని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల వచ్చే అనార్దాలపై సమాజంలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కోరారు. సీడ్ స్వచ్చంధ సంస్థ ప్రధాన శిక్షకులు ప్రకాష్ మాదకద్రవ్యాలు బారిన పడకుండా కాపాడడం, వారికి గల సదుపాయాలు, కుటుంబం సభ్యుల సహకారంపై అవగాహన కల్పించారు. కో అర్డినేటరు రాజు మాట్లాడుతూ విజయనగరంలో మత్తుపదార్థాలకు బానిసైన వారికి, వాటి బారినుండి విముక్తి చేసేందుకు పునరావాస కేంద్రం నిర్వహిస్తున్నామని, నెలరోజులు ఉచిత వసతి, చికిత్స అందిస్తామని తెలిపారు. కావున జిల్లాలో మత్తుపదార్థాలకు బానిసలైన వారిని ఈ కేంద్రాలకు తీసుకువచ్చి సేవలు పొందవచ్చునని, చికిత్స అనంతరం కూడా నిరంతరం వారిని పర్యవేక్షిస్తుంటామని తెలిపారు. శిక్షణలో ఇన్ఛార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డి.భాస్కరరావు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్, ఐసిడిఎస్ పిడి కె.విజయగౌరి ఇతర అధికారులు పాల్గొన్నారు.










