ప్రజాశక్తి-ఆలూరు
'మా యజమానులకు మమ్మల్ని అప్పగించి న్యాయం చేయాల'ని ఆలూరులోని పశువులు కోరుతున్నారు. ఆలూరు పోలీసు స్టేషన్ ముందు తెల్లవారుజామున నిరసన తెలుపుతూ, ధర్నా చేపడుతూ కంటపడ్డాయి. పశువులు నిరసన, ధర్నా చేయడం ఏమిటని ఆశ్చర్యం కలుగుతోంది. కదా..!
ఆలూరు నియోజకవర్గ కేంద్రం పట్టణానికి తక్కువ, గ్రామ పంచాయతీ ఎక్కువ అన్నట్లుగా ఉంది. ఎప్పుడూ రద్దీగా ఉండే పాతబస్టాండ్ నుంచి చెక్‌పోస్ట్ వరకు పాఠశాల, కళాశాల, బస్టాండ్, పోలీసు స్టేషన్, కోర్టు, రిజిస్ట్రార్, వ్యాపార దుకాణాలు జనాలతో పాటు పశువులు, కోతులు, కుక్కలతో బిజీగా ఉంటాయి. కర్నూలు, ఆదోని నుంచి బళ్లారికి వెళ్లే జాతీయ రహదారి ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. వాహనాలకు అడ్డుగా వచ్చే పశువులు, కుక్కలు, కోతులు ప్రమాదానికి గురైన సంఘటనలు చాలానే ఉన్నాయి. పశువులకే కాకుండా మనుషులు కూడా ప్రమాదాలకు గురై గాయాలయ్యాయి. సర్పంచి, అధికారులు పశు యజమానులకు, నోటీసులు ఇచ్చి ఇంటి దగ్గర కట్టేసుకోవాలని తెలిపినా నిర్లక్ష్యంగా పురవీధుల్లో పశువులను వదిలేస్తున్నారు. సర్పంచి, అధికారులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. శనివారం అర్ధరాత్రి నుంచే పశువులే మూకుమ్మడిగా పోలీసు స్టేషన్‌ను ముట్టడించి ధర్నా చేపట్టాయి. స్వచ్ఛమైన పశుగ్రాసం లేక రోడ్లపై ఉండే ప్లాస్టిక్, పేపర్లు, మురుగు నీరు తాగుతూ అనారోగ్యం పాలవుతూ వాహనాల కిందపడి గాయాలై మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. పోలీసులు ఉదయం 6 గంటలకు పశువులపై లాఠీ చార్జీ చేసి తరిమికొట్టారు. గ్రామంలోని పశువులను యజమానులు వీధుల్లో వదిలేయకుండా ఇంటిలో పెట్టుకుంటారో లేదో వేచి చూడాలి.
ఆలూరు పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న పశువులు










