ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఆదివాసి అధిక రాష్ట్రీయ మంచ్ జాతీయ కోఆర్డినేటర్ సభ్యులుగా లోదొడ్డి సర్పంచ్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఎన్నికైన నేపథ్యంలో చిన్న వయసులోనే జాతీయ స్థాయి నాయకుడిగా రామారావు ఎదిగినందుకు ఏజెన్సీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19, 20, 21 తేదీలలో తమిళనాడు రాష్ట్రంలో నమ్మక్కల్ జిల్లాలో ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్, మాజీ ఎంపీ మీడియం బాబురావు అధ్యక్షతన జరిగిన మహాసభల్లో, దేశంలో 19 రాష్ట్రాల నుండి ఆదివాసి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మహాసభల్లో జాతీయ కోఆర్డినేటర్ చైర్మన్ గా మాజీ మంత్రి జితేంద్ర చౌదరి ఎంపిక కాగా, మరో 67 మంది సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 5గురు ఎంపిక కాగా వారిలో లోతా రామారావు ఒకరు కావడం విశేషం. లోతా రామారావు రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డి పంచాయతీలో రెండు పర్యాయాలు సర్పంచ్ గా ఎన్నికైయ్యారు. గిరిజనుల హక్కులు, చట్టాలు, జీవో నెంబర్ 3,అటవీ హక్కుల చట్టం పరిరక్షణకై గిరిజనులు, కార్మికులు పేద ప్రజల సమస్యలు పరిష్కారం కోసం జరిగిన అనేక పోరాటాల్లో ప్రధాన పాత్ర పోషించారు. నిజాయితీపరుడు, నిరారంబరుడు, మంచివాడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన లోతా రామారావు జాతీయ స్థాయి నాయకుడిగా ఎన్ని కవ్వడం పట్ల గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కుంజం జగన్నాథం, కొండ్ల సూరిబాబు, సిఐటియు, డివైఎఫ్ఐ, అంగన్వాడి, ఆశ తదితర సంఘాల నాయకులు పి రామరాజు, టి శ్రీను,కె వెంకటలక్మి,ఏ అమ్మిరాజు, సర్పంచుల సమైక్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు శుక్రవారం అభినందనలు తెలిపారు.










