Aug 13,2023 15:45

కుటుంబంలో అత్తాకోడళ్ల మధ్య బంధాలు, అనుబంధాలు చర్చనీయాంశంగా ఉంటాయి. ఒకర్ని ఒకరు అర్థం చేసుకునేకన్నా అపార్థాలే ఎక్కువగా చోటు చేసుకుంటాయి. అలా తన లైఫ్‌లో జరగకూడదని అనుకుంటుంది 'ఎల్‌జిఎం' సినిమా హీరోయిన్‌. ఈ నేపథ్యంలో అత్త మనస్తత్వం తెలుసుకునేందుకు పెళ్లికి ముందే ఆమెతో కలిసి కొన్ని రోజులు ట్రావెల్‌ చేయాలనుకుంటుంది. అందుకు ప్రేమించిన హీరో కూడా సహకరిస్తాడు. ఈ కాన్సెప్ట్‌ అందరికీ కనెక్టయ్యేలా దర్శకుడు రమేష్‌ తమిళమణి సినిమా తీశారు. మరి ఎంత వరకు ప్రేక్షకులను మెప్పించాడో తెలుసుకోవాలంటే సినిమా ఎలా ఉందో చూడాల్సిందే.
కథలోకి వెళితే... గౌతమ్‌ (హరీష్‌ కల్యాణ్‌) తన కంపెనీలోనే పనిచేస్తున్న మీరా (ఇవానా) ను రెండేళ్లుగా ప్రేమిస్తుంటాడు. ఎట్టకేలకు ఆమెను పెళ్లికి ఒప్పిస్తాడు. మరోవైపు గౌతమ్‌కి పెళ్లి చేయాలని అతని తల్లి లీలా (నదియా) రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మీరాతో తన ప్రేమ గురించి తల్లికి చెప్తాడు గౌతమ్‌. లీలా కూడా వెంటనే పెళ్లికి ఓకే చెబుతుంది. అప్పటివరకు హాస్టల్లో పెరిగిన మీరా ఒక్కసారిగా గౌతమ్‌ ఫ్యామిలీతో కలిసి ఉండేందుకు వెనకాడుతుంది. పెళ్లయిన తర్వాత అత్తతో సమస్యలు తలెత్తకుండా ఉండటానికి పెళ్లికి ముందే ఆమెతో కలిసి కొన్ని రోజులు గడపాలని కోరుకుంటుంది. అందుకోసం ఓ టూర్‌ ప్లాన్‌ చేస్తుంది. ఈ వింత ప్రతిపాదనకు గౌతమ్‌ అంగీకరించి, ఆఫీస్‌ ట్రిప్‌ అని అబద్ధం చెప్పి.. తన తల్లిని ఒప్పిస్తాడు. అలా స్నేహితులు, వారి కుటుంబాలతో కలిసి కూర్గ్‌కి బయల్దేరతారు. వెళ్లాక ఏం జరిగింది? మీరా-గౌతమ్‌ తల్లితో కలిసిపోయిందా? లేదా? గౌతమ్‌తో మీరా పెళ్లికి ఒప్పుకుందా? అనే విషయాల్ని వెండితెరపై చూడాల్సిందే.

'ఎల్‌.జి.ఎమ్‌' (Lets Get Married)

ఈ సినిమా ద్వారా క్రికెటర్‌ ధోని భార్య సాక్షి సినీ నిర్మాణంలోకి ప్రవేశించింది. ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరుతో ఏర్పాటైన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రం కావడంతో ప్రేక్షకులందరూ ప్రత్యేకమైన ఆసక్తి కనబర్చారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెళ్లికి ముందే అత్తతో కలిసి కోడలు టూర్‌కి వెళ్లే కాన్సెప్ట్‌ వినడానికి కాస్త కొత్తగా ఉంది. కానీ తెరపై మాత్రం రొటీన్‌గా సాగుతుంది. సీరియస్‌, సెంటిమెంట్‌తో కాకుండా ఈ అత్తాకోడళ్ల కాన్సెప్ట్‌కు కామెడీని మిక్స్‌ చేస్తూ రెండున్నర గంటలు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయాలనుకున్నారు దర్శకుడు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. సినిమాలా కాకుండా సీరియల్లా నెమ్మదిగా కథనం సాగుతుంది. ఐడియా బాగుంది కానీ అమలు చేయడంలో విఫలమయ్యారు. క్లైమాక్స్‌ అందరూ ఊహించనట్లే రొటీన్‌గా ఉంటుంది. సీక్రెట్‌గా అత్తాకోడళ్లు కలిసి గోవా ట్రిప్‌ వెళ్లినట్లుగా చూపించి, సెకండాఫ్‌లో ట్విస్ట్‌ ఇస్తారు. మీరా, లీలా ఒకరినొకరు అర్థం చేసుకునే డ్రామా మొత్తం గందరగోళంగా సాగుతుంది. వీరి మధ్యలోకి కొత్త పాత్రలు వచ్చి, కామెడీ చేస్తాయి. దాంతో కథలో పట్టు కోల్పోయినట్లు అనిపిస్తుంది.

ఈ సినిమాకు ప్రధాన బలం ఇవానా, నదియా అనే చెప్పాలి. హీరోగా హరీశ్‌ కల్యాణ్‌ అయినా కథ మొత్తం ఇవానా, నదియా పాత్రల చుట్టే తిరుగుతుంది. అత్తాకోడళ్లుగా వీరిద్దరి నటన ఆకట్టుకుంటుంది. నేటితరం అమ్మాయిలా ఇవానా, గడుసరి అత్తగా నదియా నటన అద్భుతంగా ఉంది. వీరిద్దరి మధ్య నలిగే పాత్రలో హరీశ్‌ కల్యాణ్‌ చక్కగా నటించాడు. బస్సు డ్రైవర్‌గా యోగిబాబు చేసే కామెడీ సినిమాకు ప్లస్‌ పాయింట్‌. హీరో స్నేహితుడిగా చేసిన నటుడి కామెడీ పంచులు కూడా బాగున్నాయి. ఇక సాంకేతిక విషయాలకొస్తే దర్శకుడు తమిళమణియే ఈ సినిమాకు సంగీతం అందించాడు. పాటలు కథలో భాగంగా వస్తాయి.. కానీ హృదయానికి హత్తునేలా ఉండవు. సున్నితమైన బంధాలు (అత్తా-కోడలు) బలపడాలంటే ఇంకాస్త బలమైన మాటలు, డైలాగ్స్‌తో పాటు మంచి సన్నివేశాలు క్రియేట్‌ చేస్తే బాగుండేది.

నటీనటులు : హరీష్‌ కల్యాణ్‌, ఇవానా, నదియా, యోగిబాబు,ఆర్జే విజరు, వీటీవీ గణేష్‌, వెంకట్‌ ప్రభు, శ్రీనాథ్‌, మోహన్‌ వైద్య తదితరులు.
దర్శకత్వం, సంగీతం : రమేష్‌ తమిళ్‌ మణి
నిర్మాతలు : సాక్షి సింగ్‌ ధోని,
వికాస్‌ హస్జా
నిర్మాణ సంస్థ : ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌