Oct 05,2023 22:37

ముగిసిన వానాకాలం
జులైలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు
మూడునెలలు సరిగా పడని వర్షాలు
భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం
ఆందోళనలో మెట్టప్రాంత రైతులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఈ ఏడాది సరిపడు వర్షాలు పడకుండానే వానాకాలం ముగిసింది. నాలుగు నెలల వర్షాకాలంలో ఒక్కనెలలో మాత్రమే సాధారణ వర్షం కురవడంతో లోటు వర్షపాతం ఏర్పడింది. ప్రస్తుతం పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ లోటువర్షపాత ప్రభావం రానున్న కాలంలో మెట్టప్రాంతంలో తీవ్రంగా పడుతుందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో పశ్చిమగోదావరి జిల్లాలో 2.13 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేపట్టారు. వర్షాలు సరిగా పడకపోవడంతో వరినాట్లు ఆలస్యమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాంతం కావడంతో వర్షాలు తక్కువగా పడినప్పటికీ కాలువల ద్వారా గోదావరి నీరు వస్తుండటంతో ఖరీఫ్‌సాగుకు పెద్దగా ఇబ్బందిలేదు. మెట్టప్రాంతంలో పరిస్థితి పూర్తిభిన్నంగా ఉంది. ప్రాజెక్టుల కింద కొంతమేర సాగు ఉన్నప్పటికీ అత్యధికంగా మోటారు బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాభావంతో మెట్టప్రాంతంలోని చెరువులు అడుగంటడంతోపాటు, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో లోటువర్షపాత ప్రభావం వచ్చే రబీలో తీవ్రంగా చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నాలుగ నెలలు కురిసే వర్షాల ఆధారంగానే మెట్ట ప్రాంతలో చెరువుల నీటిమట్టాలు, భూగర్భజలాలు పెరగడం వంటివి జరుగుతాయి. నీటిమట్టాలు పెరిగితే బోర్లు భాగా పనిచేసి రబీలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ ఏడాది జూన్‌లో సరాసరిగా 112.5 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా 86.3 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 23.3 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు ఏర్పడింది. జులై నెలలో 242.9 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా 319.8 మిల్లీ మీటర్లు కురవడంతో 31.7 మిల్లీమీటర్ల వర్షం అదనంగా పడింది. ఆగస్టులో 212.4 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా 90.9 మిల్లీమీటర్లు వర్షం మాత్రమే పడటంతో 57.2 మిల్లీమీటర్ల వర్షపాతలోటు ఏర్పడింది. సెప్టెంబర్‌లో 171.5 మిల్లీ మీటర్లకు 137 మిల్లీమీటర్లు పడటంతో 20.1 మిల్లీమీటర్ల వర్షపాత లోటు ఏర్పడింది. వానలు సరిగా కురవకపోడంతో మెట్టప్రాంతంపై తీవ్ర ప్రభావం కనిపిస్తుందని రైతులు చెబుతున్నారు. పోలవరం, కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల మండలాల్లో వర్షం భాగా తక్కువ పడింది. దీంతో ఆయా మండలాల్లో చెరువులు అడుగంటాయి. దీంతో పశువులకు సైతం తాగునీటి ఇబ్బందులు ఏర్పడిందని చెబుతున్నారు. వర్షపాతం లోటుతో వచ్చే రబీలో తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భూగర్భజలాలు తగ్గిపోవడంతో బోర్ల నుంచి నీరు సరిగా వచ్చే పరిస్థితి ఉండదు. అదే జరిగితే సాగునీరు అందక పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లోనూ చింతలపూడి, ద్వారకాతిరుమల, పోలవరం, కొయ్యలగూడెం వంటి అనేక మండలాల్లో పంటలపై తీవ్ర ప్రభావం పడనుంది. వర్షాలు సరిగా కురవకపోవడంతో డెల్టాలో సైతం పంటలు ఏపుగా పెరగకపోవడం, తెగుళ్లు సోకడం వంటి సమస్యలున్నట్లు రైతులు చెబుతున్నారు. వర్షపాతం లోటుతో వచ్చే సమస్యలను ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరిస్తుందో వేచిచూడాల్సి ఉంది.
నాలుగునెలల వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో)
నెల     కురిసిన వర్షం         కురవాల్సిన వర్షం          లోటువర్షపాతం
జూన్‌     86.3                   112.5                       -23.3
జులై      319.8                242.9                         ప్లస్‌31.7
ఆగస్టు    90.9                 212.4                          -57.2
సెప్టెంబర్‌   137                171.5                           -20.1