ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణంలో ఎడతెరపీ లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆవదూడ వంక పొంగిపొర్లడంతో నీళ్లు ఇళ్లలోకి చేరాయి. మర్చంట్ క్లబ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణమంతా వర్షపు నీరు నిలవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ : పట్టణంలోని ఎల్‌బి స్ట్రీట్, పాత ఓవర్ బ్రిడ్జి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిలిచిన వర్షపు నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. కల్వర్టు వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుధ్య కార్మికులతో తొలగించి నీరు పారేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఆదోని డివిజన్‌లో వర్షపాతం : గత రెండు రోజుల నుంచి ఆదోనిలో ఎడతెరపీ లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం ఆదోని డివిజన్ మొత్తం 144.4, సగటు 16.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదోని 10.2, హోళగుంద 6.2, పెద్దకడబూరు 10.6, ఎమ్మిగనూరు 18.2, నందవరం 19.4, గోనెగండ్ల 19.6, మంత్రాలయం 25.8, కోసిగి 26.2, కౌతాళం 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రోడ్లు చిత్తడిగా మారి, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు తెలిపారు.










