ప్రజాశక్తి - ఆదోని
లోపాలకు ఆస్కారం లేకుండా తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. గురువారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ సమ్మరీ రివిజన్-2024పై తహశీల్దార్ వెంకట లక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అనుపమతో కలిసి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు. ఇంటింటి ఓటర్ల పరిశీలనలో పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని తెలిపారు. ఒకే ఇంటి నెంబర్ మీద 20 ఓట్లు, అంత కంటే ఎక్కువ నమోదైతే వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. అన్ని అంశాలను సంబంధిత బూత్ లెవెల్ స్థాయి అధికారులతో సంప్రదించి తెలుసుకోవచ్చని రాజకీయ ప్రతినిధులకు సూచించారు. డిసెంబర్ 26 నాటికి పూర్తి చేసి జనవరి 5, 2024న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని తెలిపారు.
15 వేల బోగస్ ఓటర్లు
పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 15 వేలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని తెలుస్తోందని, వాటిని తొలగించేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కౌన్సిలర్ బాలాజీ మాట్లాడుతూ... కుటుంబంలోనే ఇద్దరు, ముగ్గురు పేర్లు వేరే వార్డుల్లో ఉండడం వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఇంటి నెంబర్ వారీగా వరుస క్రమంలో పేర్లు ఉండేలా చూడాలన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ... వార్డులో బిఎల్‌ఒలు పర్యటిస్తున్న సమయం తెలియక సర్వేలో పాల్గొనలేకపోతున్నామని తెలిపారు. మాజీ సర్పంచి గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ... ఆదోని మండలం హానవాల్ గ్రామంలో సుమారు 300 ఓట్లు వేరే ప్రాంతం వారివి ఉన్నాయని, తొలగించాలని కోరారు. టిడిపి నాయకులు తిమ్మప్ప మాట్లాడుతూ... వార్డు విభజన సమయాల్లో వరుస క్రమం కాకుండా వేరే ప్రాంతాల వారిని కలిపి జాబితా తయారు చేయడం వల్ల ఓటర్లను కలవలేని పరిస్థితి ఉందని తెలిపారు. రెవెన్యూ వార్డు ప్రకారం జాబితా తయారు చేయాలని కోరారు. మాజీ కౌన్సిలర్ రామలింగేశ్వర యాదవ్ మాట్లాడుతూ... దొంగ ఓట్లను తొలగించాలని దశాబ్ద కాలంగా కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, నీలకంఠప్ప మాట్లాడుతూ... ఓటరు జాబితాలో పేరు నమోదుపై ప్రజల్లో అవగాహన లేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి చైతన్య పరచాలన్నారు. టిడిపి నాయకులు బుద్ధారెడ్డి మాట్లాడుతూ... చనిపోయిన వారి పేర్లు అలానే వస్తున్నాయని, తొలగించాలని కోరినా బిఎల్‌ఒలు పట్టించుకోవడం లేదని తెలిపారు. తుది జాబితాలో లేకుండా చూడాలన్నారు. టిడిపి నాయకులు బాలాజీ, శ్రీనివాసాచారి, జయరాం, చిట్టి, కాంగ్రెస్ నాయకులు దిలీప్, సిపిఐ నాయకులు రాజు, బీఎస్పీ నాయకులు శాంతకుమార్, వైసిపి నాయకులు ప్రసాద్ రావు, మమ్ముత్తి స్వామి, నల్లారెడ్డి, జనసేన నాయకులు తాహెర్ వలీ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణ్










