ప్రజాశక్తి - ఆదోని
ఆదోని కబ్జాలకు నిలయంగా మారిందని, అధికార పార్టీ నాయకుల అండతోనే అంతా జరుగుతోందని ప్రచారం సాగుతోంది. జరిగిన అన్యాయాన్ని వారం, వారం అధికారులు నిర్వహిస్తున్న 'స్పందన'లో అధికారులకు ఫిర్యాదు చేస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారుల జాడ కనిపించడం లేదు.
పట్టణ శివారులోని 352 సర్వే నెంబర్‌లో గల భూమి వివాదం నడుస్తోంది. 32 ఏళ్లుగా సమస్యాత్మకంగా ఉన్న ఆదోని మండలం మండిగిరి పంచాయతీ 352 సర్వే నెంబర్ ప్లాట్ల సమస్య రోజురోజుకు ముదురుతూనే ఉంది. ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి పరిష్కార మార్గం చూపి 421 మందికి న్యాయం చేస్తే నిందలు వేయడం ఏమిటని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వైసిపి నాయకులు రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ఇటీవల ఆ స్థలంలోనే వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశారు. 352 సర్వే నెంబర్ వివరాలను, కొనుగోలు చేసిన పత్రాలను, జరిగిన అక్రమాలు, బినామీ రిజిస్ట్రేషన్లు, ఒక్కో ప్లాటును రెండు, మూడుసార్లు అమ్మిన వివరాలను వెల్లడించారు.
అక్రమాలకు తెర : 352 సర్వేనెంబర్‌లో హమీద్ అనే వ్యక్తి చంద్రమ్మ అనే మహిళ ద్వారా రెండెకరాల భూమిని కొనుగోలు చేసి ప్లాట్ వేసి 1991లో 73 మందికి విక్రయించినట్లు తెలిసింది. మొదట 73 మందికి ప్లాట్లు అమ్మిన హమీద్ మరోసారి మరో 80 మందికి ప్లాట్లు అమ్ముకుని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు. మరోపక్క ఆబిద్ అనే వ్యక్తి 4.24 ఎకరాలను చంద్రమ్మ ద్వారా అగ్రిమెంట్ చేయించుకుని 187 మందికి ప్లాట్లు విక్రయించినట్లు రుజువైంది. అలాగే 2016లో హర్ష అనే వ్యక్తి ఇదే భూమిపై ఎన్‌ఎ చేయించుకుని మళ్లీ ప్లాట్లు వేసి అమ్ముకున్నట్లు సమాచారం. మళ్లీ 2019లో ఎరుకల సూరి అనే వ్యక్తి హమీద్ నుంచి 60 సెంట్ల భూమిని కొనుగోలు చేసి ప్లాట్లు అమ్ముకున్నారని ఇటీవల విమర్శలు వచ్చాయి. ఈ విధంగా మొత్తం నాలుగు ఎకరాల భూమిలో 421 మంది బాధితులు డబ్బులు కట్టి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
కాసులకు కక్కుర్తి : ఒకే భూమిని పేర్లు మార్చి ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌గా మార్చి లేఅవుట్‌కు రెవెన్యూ, ఇతర అధికారులు సహకరించారు. అధికారులు అక్రమాలకు పూర్తిగా సహకరించినట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి. డబుల్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేసి అధికారులు కూడా కాసులకు కక్కుర్తి పడినట్లు తెలిసింది.
కళ్లు మూసుకున్న అధికారులు : పట్టణ శివారులో స్థలం ఉండడం వల్ల ప్రస్తుతం మార్కెట్ విలువ సెంట్ రూ.10 లక్షలు ఉంటుందని పలువురు చెబుతున్నారు. అంత విలువైన స్థలాన్ని ప్రస్తుతం నాయకులు తమ కబంధహస్తాల్లో ఉంచుకొని బాధితులకు న్యాయం చేస్తున్నామంటూ నమ్మబలుకుతున్నారు. కేవలం ప్లాట్ ఒకటిన్నర సెంటు రూ.1.60 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసినట్లు బాధితులు వాపోతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కళ్లు మూసుకొని ఉండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జరగని న్యాయం : 2019లో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని ఆశ్రయిస్తే ఆయన ఎన్నికల అనంతరం ఈ సమస్యను సిసిఎల్‌ఎ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులందరికీ మార్కెట్ విలువ కాకుండా ఒక్కో ప్లాటును రూ.1.60 లక్షలు చెల్లించే విధంగా ఒప్పందం కుదిర్చి మధ్యవర్తులైన అక్షరశ్రీ రామకృష్ణారెడ్డి ద్వారా చెల్లించే విధంగా లబ్ధిదారుల నుండి డాక్యుమెంట్లు స్వీకరించారని పలువురు చెబుతున్నారు. డాక్యుమెంట్లు సేకరించినా ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదని ప్రచారం సాగుతోంది. ఆ స్థలం విలువ రూ.కోట్లలో ఉందని, అవసరమనుకుంటే మరింత కూడా పెంచి బాధితులకు ఇవ్వవచ్చని ఇటీవల టిడిపి నాయకులు ఉమాపతి నాయుడు చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఎస్సీల భూములను ఉమాపతి నాయుడు కబ్జాకు పాల్పడి అన్యాయం చేశారని ఇటీవల ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మీడియాకు వివరించడంతో రాజకీయంగా దుమారం లేపింది. ఇరువురు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుని ఉంటున్నారే తప్ప బాధితులకు న్యాయం చేయాలని ఎవరి పోరాటం ఉండదని వామపక్ష నాయకులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అసలైన లబ్ధిదారులకు న్యాయం చేకూరేలా చూడాలని కోరుతున్నారు.
విచారణ జరిపించాలి
- లక్ష్మణ్, సిపిఎం పట్టణ కార్యదర్శి
దశాబ్ద కాలంగా వివాదంలో ఉన్న 352 సర్వే నెంబర్ ఇంటి స్థలాల వివాదాన్ని అధికారులు పరిష్కరించాలి. అసలైన లబ్ధిదారులకు నష్టం వాటిల్లకుండా సమగ్ర విచారణ చేపట్టాలి. ఆ భూమి అక్రమాల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల హస్తమున్నట్లు కూడా తెలిసింది. వారిని బాధ్యులను చేసి భూములు కొనుగోలు చేసిన వారికి ప్రస్తుత మార్కెట్ విలువ ఇవ్వాలి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి నిష్పక్షపాతంగా న్యాయం చేయాలి. వారి సామాజిక వర్గం వారికే ఆ భూమిని ఇప్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే చిత్తశుద్ధి చాటుకోవాలి.
బాధితులకు అండగా ఉంటాం
- సుదర్శన్, సిపిఐ పట్టణ కార్యదర్శి
పట్టణంలో భూములకు సంబంధించిన ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బాధితులకు అండగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్ల కబ్జాలు పెరిగిపోతున్నాయి. 352 సర్వే నెంబర్‌లో జరిగిన అక్రమాలకు పూర్తి బాధ్యత అధికారులదే. ప్రస్తుతం ఆదోనిలో సబ్ కలెక్టర్ ఉన్నప్పటికీ అలాంటి వివాదస్పదమైన భూముల విషయాలు పరిశీలించి న్యాయం చేయాల్సింది పోయి చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. బాధితులకు మేము అండగా ఉంటాం. ముందుకొస్తే అధికారులకు ఫిర్యాదు చేస్తాం.
352 సర్వేనెంబర్ స్థలం ఇదే










