ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు పూర్తి చేసుకోవాలని ఎల్విన్‌పేట సిఐ బి.సత్యనారాయణ సూచించారు. స్థానిక డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫేర్వెల్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు డిగ్రీ విద్య ఒక కీలకదశని, ఈ సమయంలోనే విద్యార్థులు సరైన మార్గాన్ని ఎంచుకొని, తమ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాలని కోరారు. ఆధునిక సాంకేతిక యుగంలో విద్యార్థులకు ఎన్నో మార్గాల ద్వారా ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. దాన్ని అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు. అనంతరం ఎస్‌ఐ షణ్ముఖరావు మాట్లాడుతూ సెల్‌ఫోన్ కారణంగా విద్యార్థులు చాలా సమయాన్ని వృథా చేస్తున్నారని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు విద్యార్థులను మోసం చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండి సెల్‌ఫోన్‌ను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవరం, వైశ్య సంఘం అధ్యక్షులు జి.హరిప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ రామయ్య, ఎన్‌ఎస్‌ఎస్ పిఒ త్రినాధరావు పాల్గొన్నారు.










