లక్ష్మమ్మ ఆశయ సాధనకు కృషి
- ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి.నిర్మల
ప్రజాశక్తి - నంద్యాల
మహిళా సంఘంగా జిల్లా ఉద్యమ నిర్మాణానికి టిసి లక్ష్మమ్మ తన సాయశక్తులా కృషి చేశారని, ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి.నిర్మల తెలిపారు. మంగళవారం స్థానిక ఎన్‌జిఒ కాలనీలోని టి.నరసింహయ్య భవన్‌లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు టిసి లక్ష్మమ్మ 8వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి. నిర్మల, మహిళా సంఘం పట్టణ మాజీ అధ్యక్షురాలు, సిపిఎం మాజీ కౌన్సిలర్ సత్యనారాయణమ్మ టిసి లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా టి.నిర్మల మాట్లాడుతూ టిసి లక్షమ్మ ప్రజా సమస్యలపై పని చేస్తూనే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్లూరు వార్డ్ మెంబర్‌గా ఎన్నికై పని చేశారని తెలిపారు. సారా నిషేధం ఉద్యమంలో ఆమె పాత్ర అమోఘమని, మద్యపాన నిషేధం కోసం మహిళలను ఏకం చేసి ఉదత పోరాటాలు సాగించిన మహౌన్నత వ్యక్తి అని ఆమె సేవలను కొనియాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం, మహిళల హక్కుల కోసం, మహిళలపైన జరుగుతున్న వేధింపులు నిర్మూలించాలని, గృహ హింస ఆపాలని, గృహ హింస నిరోధక చట్టం సాధించడంలో అనేక పోరాటాలు నడిపిన వ్యక్తి టిసి లక్ష్మమ్మని అన్నారు. కరెంటు చార్జీలు తగ్గించాలని, సమాజంలో జరుగుతున్న దోపిడీపై, మహిళలకు సమాన అవకాశాల కోసం పోరాడారని తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు కృష్ణవేణి, వెంకటలక్ష్మి, బాను, నాగమణి, మహాలక్ష్మి, హైమావతి, వెంకట లక్ష్మి, మహిళలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.










