జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గీతాబాయి
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో గర్భవతులు ప్రతి ఒక్కరిని నమోదు చేసుకుని, వారికి అవసరమైన వైద్య పరీక్షలు స్కానింగ్ పరీక్షలు చేయించుకునే విధంగా పర్యవేక్షిస్తున్నట్లు, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి అన్నారు. శనివారం డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో జిల్లాస్థాయి పిసి పి ఎన్ డి టి కమిటీ సమావేశం డియం అండ్ హెచ్ ఓ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్ కేంద్రాల కొత్త రిజిస్ట్రేషన్లు కోసం 3 దరఖాస్తులు, రెన్యువల్స్ 4 దరఖాస్తులు, మోడిఫికేషన్స్ 2 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించి, కమిటీ ఆమోదం కోసం సమర్పించినట్లు, కమిటీ ఆమోదించిందని డిఎం అండ్ హెచ్ ఓ తెలిపారు.జిల్లాలో ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు తమ నోటీసుకు రాలేదని, స్కానింగ్ కేంద్రాలను తరచూ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తున్నట్లు, నిబంధనల ప్రకారం స్కానింగ్ కేంద్రాలు ఎఫ్ ఫారంలో నియమిత కాల నివేదికలు సమర్పించేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో స్త్రీల లింగ నిష్పత్తి 947 గా ఉందని, ఇది రాష్ట్ర సరాసరి కంటే మెరుగ్గా ఉందన్నారు. జిల్లాలో ముఖ్యంగా నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో ఆడపిల్లల శాతం కాస్త తక్కువగా ఉందని అన్నారు. ఆడపిల్లల నిష్పత్తి పెంపు చేయుటకు గాను ప్రతి డెలివరీని ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు. గర్భవతులు స్కానింగ్ పరీక్షలు ఎక్కడ చేయించారో ఏఎన్‌ఎంలు ఆశా వర్కర్లు వివరాలు సేకరించి రిపోర్ట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ టి వెంకట్రావు, గైనకాలజిస్ట్ డాక్టర్ లీల ప్రియదర్శిని, పీడియాట్రీషియన్ డాక్టర్ శంకర్, డిపిఎంఓ సుదర్శన బాబు, కమిటీలో ఎన్జీవో సభ్యులు కే. సుశీల, ఎం. ధర్మతేజ, పి. వెంకటేశ్వరమ్మ, లీగల్ కన్సల్టెంట్ పి మస్తానమ్మ, డెమో రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.










