ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ మహిళా అనురాధను ఓడించడానికి సైకో ముఖ్యమంత్రి ఎన్ని అడ్డదారులు తొక్కలో అన్ని అడ్డదారులు తొక్కారని మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. శనివారం స్థానిక టిడిపి నియోజక వర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో రవీంద్ర మాట్లాడుతూ మొన్న జరిగిన ఎం ఎల్ సి ,ఎన్నికలలో బీసీ మహిళా పంచుమర్తి అనురాధకు ఎవరు ఓటు వేయకూడదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సైతం ఈ సైకో ముఖ్యమంత్రి భయపెట్టే ప్రయత్నం చేసాడని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి టెక్నికల్ గా 23 మంది సభ్యులు ఉన్నపటికీ 4గురు ఎమ్మెల్యే లను తనవైపు తిప్పుకుని ఈ ఎన్నికల్లో వారు తెలుగుదేశానికి ఓటు వేయకుండా చేసాడన్నారు. ఎవరు ఎన్ని అనైతిక చెర్యలు చేపట్టిన చెక్కు చెదరని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముందుకెళ్లడం జరిగిందని గుర్తు చేశారు. బీసీ మహిళను ఎన్నికల్లో ఎంపిక చేయడమే కాదు ఎట్టి పరిస్థితుల్లో ఆమెను గెలిపించాలని శాయశక్తులా ప్రయత్నించి అనురాధను తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గెలిపించి యావత్ బీసీ ల ఆత్మ గౌరవాన్ని కాపాడారని కొనియాడారు. పంచుమర్తి అనురాధ అతి చిన్న వయసులోనే విజయవాడ మేయర్ గా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారని, బీసీల కోసం అనేక పోరాటాలు చేసారని, పార్టీకి అండగా నిలిచారని గుర్తు చేశారు. దీని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులూ ఆమెపై సామజిక మాధ్యమాల్లో ఫోటోలు మార్ఫింగ్ చేసి, వ్యక్తిగత జీవితాన్ని దూషిస్తూ పోస్ట్లు పెట్టి మానసికంగా దెబ్బకొట్టాలని చూసారన్నారు. ఒక మహిళకు అది బీసీ ఆడపడుచుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. అందుకే తెలుగుదేశం పార్టీ బీసీ మహిళా గౌరవాన్ని కాపాడేవిధంగా ఆమెకు ఎమ్మెల్సీగా కాకుండా, గెలుపొందేల కృషి చేసి మరోసారి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని నిరూపితమైందని స్పష్టం చేసారు. మాజీ ఎంపీ టీడీపీ జిల్లా అధ్యక్షులు నారాయణరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పని అయిపోయిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నిన న్యాయమే గెలుస్తుందని మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం వి,బాబా ప్రసాద్ ,మండల పార్టీ అధ్యక్షులు కుంచె నాని, మరియు గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.










