ప్రజాశక్తి-ఆదోనిరూరల్
ఖరీఫ్ సీజన్‌పైనే మెట్ట రైతులు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో జూన్ నుంచే విత్తనాలు వేస్తుంటారు. ఈ ఏడాది ఆగస్టు వచ్చినా, సరైన వర్షం లేక విత్తనాలు వేయలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికే అదును దాటుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా దుక్కి దున్ని విత్తనాలు నాటకుండా వదిలేసిన భూములే దర్శనమిస్తున్నాయి...
ఈఏడాది ఖరీఫ్ సీజన్ రైతులకు అనుకూలంగా లేదు. జూన్‌లో తీవ్రమైన ఎండలతో పనులు ముందుకు సాగలేదు. జులై రెండో వారం నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఆగస్టు నెల ప్రారంభం నుంచి తిరిగి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో బోర్ల కింద తప్ప మిగిలిన చోట పనులు నిలిచిపోయాయి. జిల్లాలో సాగు విస్తీర్ణమే తక్కువ. అందులోనూ ఇప్పటివరకు కేవలం 20 శాతం పొలాల్లో మాత్రమే పంటలు వేశారు. వీటిలో బోర్ల కింద, అక్కడక్కడ చెరువుల కింద వేసిన నాట్లు నీరు లేక ఎండిపోతున్నాయి. జిల్లాలో ఆదోని, ఆలూరు, హోళగుంద, కోసిగి, చిప్పగిరి, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ మండలాల్లో తక్కువగా వర్షపాతం నమోదు కావడంతో ఇంకా 80 శాతానికి పైగా ఖరీఫ్‌లో పంటలు వేయాల్సి ఉంది. ఇప్పటికే 20 శాతంలో సాగు చేసిన పొలాల్లో సరైన వర్షాలు లేక పత్తి, మిరప వేసిన పొలాలు ఎండిపోతున్నాయి. సాధారణంగా ఆగస్టు ప్రారంభం నాటికి 60 నుంచి 70 శాతం మేర నాట్లు పూర్తి కావాలి. రెండో వారంలోకి ప్రవేశించినా అన్ని రకాల పంటలు కలిపి 20 శాతం సాగు చేశారు. అందులో వరి 10 నుంచి 15 శాతం మాత్రమే ఉంది. ప్రస్తుతం బోర్ల కింద నాట్లు వేస్తున్నారు. వర్షాధారంపై ఆధారపడిన భూముల్లో నాట్లు వేయడానికి రైతులు ఎదురుచూస్తున్నారు. మరో వారం, పది రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే నాటిన మిరప, పత్తి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వర్షంపై ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తుంటారు రైతులు. వచ్చే నెల రెండో వారం వరకూ చూసి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఆశాజనకంగా లేదు
- ఎఒ అశోక్ కుమార్ రెడ్డి
జిల్లాలో ఖరీఫ్ సాగు ఈఏడాది ఆశాజనంగా లేదు. సాధారణంగా జూన్, జులై నెలల్లో మెట్ట పంటలు సాగు చేస్తారు. వర్షాల్లేక సమస్య నెలకొంది. జల్లులు పడితే ఆగస్టు చివరి వరకు కంది, పత్తి, మిర్చి వంటివి సాగయ్యే అవకాశం ఉంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగానే ఉన్నాయి. కావాల్సిన వారు ఆర్‌బికెలను సంప్రదించవచ్చు.
వర్షాల్లేక ఎండిపోతున్న మిరప పంట










