Jul 15,2023 21:53

అడుగంటిన శ్రీశైలం డ్యాం నీటి మట్టం

ఖరీఫ్‌ సాగు కష్టమే...
ప్రాజెక్ట్‌ ల్లో నీళ్లు నిల్‌... మొండి కేసిన వరుణుడు...
ఆరు తడి పంటలు మేలంటున్నా అధికారులు
ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌

       ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు కష్టంగానే ఉండబోతుంది... వర్షాకాలం ప్రారంభం అయినా నేటికీ వర్షం అనుకున్న రీతిలో పడకపోవడం, మేఘాలు మొండికేయడం వలన జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద ఖరీఫ్‌ సాగు ముందుకు సాగడం లేదు. కేవలం నామ మాత్రంగానే రైతన్న సాగు చేస్తున్నాడు. జిల్లాలో ఇప్పటికే వేసిన కంది, మొక్కజొన్న, పత్తి వంటిపైర్లు వర్షం రాక ఎండిపోతున్నాయి. వరి సాగుకు రైతన్న అడుగు వేస్తున్నా ప్రాజెక్టులలో పూర్తి స్థాయిలో నీరు లేకపోవడంతో రైతన్న సంసిద్ధంలో పడ్డాడు. ఇంకా వర్షాలు లేటు కావ్చనే అభిప్రాయం అధికారులలో వ్యక్తం అవుతుంది. అరుతడి పంటలు వేసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు పరిశీలిస్తే జిల్లాలో కేవలం తాగు నీటి అవసరాలకు సరిపడ నీళ్లు మాత్రమే ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌ లో కేవలం 33 టిఎం లు మాత్రమే నీరు నిల్వ ఉండగా వెలుగోడు రిజర్వాయర్‌ లో 1.6 టిఎంసిలు, ఎస్‌ఆర్‌బిసి కింద ఉన్న గోరుకల్లు రిజర్వాయర్‌ లో 1.9 టిఎంసి, ఔకు రిజర్వాయర్‌లో 1.6 టిఎంసిలు నిల్వలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న నీరు పంటలకు వదిలితే కేవలం 15 నుండి 20 రోజులు మాత్రమే వస్తుంది. అందువల్ల ఉన్న నీటిని వ్యవసాయ పంటలకు వాడితే ప్రజల దాహర్తీ తీర్చడానికి కష్టం అవుతుందనే ఉద్దేశ్యం తో ప్రాజెక్టులలో ఉన్న అరకొర నీటిని ప్రజల తాగు నీటి అవసరాల కోసం ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.గత ఏడాది ఈ పాటికి పైన కర్ణాటక మహారాష్ట్రలలో బాగా వర్షాలు పడటం, వరదలు రావడం వల్ల ఆల్మట్టి డ్యామ్‌ పూర్తిస్థాయిలో నిండి కిందికి రావడంతో తుంగభద్ర డ్యామ్‌ పూర్తి స్థాయిలో వరదనీరు వచ్చి చేరడంతో సుంకేసుల బ్యారేజికి ఇన్‌ఫ్లో పెరిగి ఈ సమయానికి సుంకేసుల నుండి కెసికి నీరు వదిలారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా అనుకున్న స్థాయిలో నీరు వచ్చి చేరడంతో ఎస్‌ఆర్‌బిసి, తెలుగు గంగా ప్రాజెక్టు కింద నీరు వదలారు. ఈ ఏడాది ఎగువ రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర లోనూ వర్షాలు అనుకున్న స్థాయిలో పడలేదు. దీంతో ప్రాజెక్టులలో నీరు చేరకపోవడంతో దిగువ ప్రాజెక్టులు వెలవెల పోతున్నాయి. ఆ ప్రభావం కర్నూలు ఉమ్మడి జిల్లా పైన పడింది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో 10 టిఎంసిలు, తుంగభద్ర డ్యామ్‌ లో 6 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కేవలం ఈ ప్రాజెక్టులకు ఇన్‌ ఫ్లో 900 నుండి 1000 క్యూసెక్యులు నీరు వచ్చి చేరుతుంది. అందువల్ల ప్రాజెక్టుల కింద ప్రస్తుత పరిస్థితుల్లో నీటి ఆధారిత పంటలు సాగు కష్టమని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ లోఈ సమయానికి కెసికి ి నీళ్లు వదిలిన అధికారులు... ప్రాజెక్టులలో నీరు లేకపోవడంతో సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పటికే వర్షబావ పరిస్థితులు నెలకొనడంతో పాటు ఈ నెల చివరి నాటికల్లా వర్షాలు రాకుంటే కరువు ఛాయలు ఏర్పడే అవకాశాలు లేక పోలేదనే అభిప్రాయం నీటి పారుదల శాఖ అధికారుల్లో వ్యక్తం అవుతుంది. వర్షాలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనపడుతున్నందున వరి వంటి సాగుకు ప్రత్యామ్నాయంగా అరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆరుతడి పంటలు మేలు: రమణయ్య ఎస్‌ఇ
నీటిపారుదల శాఖా నంద్యాల జిల్లా
జిల్లాలో వర్షాలు అనుకున్న సమయానికి పడకపోవడంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ఈ ఖరీఫ్‌లో ఆరుతడి పంటలు సాగు చేసుకుంటేనే బాగుంటుంది. ప్రాజెక్టులలో కూడా నీరు సమృద్ధిగా లేనందున వరి, నీటి ఆధారిత పంటలు సాగు చేసుకుంటే రైతులు నష్టపోయో అవకాశాలు ఉన్నందున కెసి.కెనాల్‌ కింద, ఎస్‌ఆర్‌బి సి కింద అరుతడి పంటలను వేసుకోవాలి.