ప్రజాశక్తి - పార్వతీపురం : ఓటరు పునశ్చరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఓటరు విచారణలో తప్పుల్లేని శత శాతం ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీ లక్ష్యంగా పనిచేయాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఓటరు జాబితా తయారీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే అక్టోబర్ 27 నాటికి ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని, ఈనెల 17 నుంచి నవంబరు 30 వరకు అభ్యంతరాలు, క్లైమ్‌లు స్వీకరించడంలో ప్రత్యేక చొరవ చూపాలని ఆయన అన్నారు. ఇంటింటి ఓటరు విచారణ చేసి శాశ్వతంగా గ్రామాలను వదలిన వారిని, మృతి చెందిన వారిని, డూప్లికేట్ ఎంట్రీ తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పెండింగ్‌లో ఉన్న ఫారం 7,8లను పరిష్కారం వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఇంటింటికీ ఓటరు సర్వే విచారణలో ప్రత్యేక పర్యవేక్షణతో చేపట్టామన్నారు. అనంతరం మృతి చెందిన ఓటర్లు, శాశ్వత వలసలు, డబుల్ ఎంట్రీ ఓటర్లు తొలగింపు విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 15 నుంచి ఇప్పటి వరకు 19,572 ఫారం-6 దరఖాస్తులు, 23738 ఫారం-7 దరఖాస్తులు, 67616 ఫారం-8 దరఖాస్తులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఫారం-6 దరఖాస్తులు 1351, ఫారం-7 దరఖాస్తులు 2322, ఫారం-8 దరఖాస్తులు 3298 పరిశీలన పెండింగ్‌లో ఉందని వివరించారు. 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన గృహాలు 3727, జంక్ కేరెక్టన్లు ఉన్న 8009 గృహాలను పూర్తిగా విచారణ చేశామని తెలిపారు. జంక్ కేరెక్టర్స్ ఉన్న 1375 ఫారాలు, 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన గృహాల్లో ఉన్న 16599 ఫారాలను అప్ లోడ్ పెండింగ్‌లో ఉందని, త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పోలింగ్ కేంద్రాల పరిధిలోని వలసల, నకిలీ ఓట్ల అభ్యంతరాలు, స్వీకరించిన అనంతరం విచారణ చేపట్టి ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్న చర్యలు వివరిస్తున్నట్లు తెలిపారు. బిఎల్‌ఒ, సూపర్వైజర్లు ఒకే ఇంట్లో 10 మంది కంటే ఎక్కువ ఉన్న ఓటర్లు వివరాలు, డోర్ నంబర్లు పరిశీలన చేసి ఫామ్ 7,8 లు పూర్తికి ప్రత్యేక దష్టి సారించినట్లు వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అర్.గోవింద రావు, సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎ పిఒలు కల్పనా కుమారి, సి.విష్ణు చరణ్, డిఆర్‌ఒ జె.వెంకటరావు, ఆర్‌డిఒ కె.హేమలత, తదితరులు పాల్గొన్నారు.










