Sep 12,2023 21:38

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌; పాల్గొన్న జెసి, ఐటిడిఎ పిఒలు

ప్రజాశక్తి - పార్వతీపురం : ఓటరు పునశ్చరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఓటరు విచారణలో తప్పులు లేని ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఓటరు జాబితా తయారీపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇంటింటి ఓటరు విచారణ చేసి శాశ్వతంగా గ్రామాలను వదలిన వారిని, మతి చెందిన వారిని, డుప్లికేట్‌ ఎంట్రీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తొలగించే కార్యక్రమం వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇంటింటికీ ఓటరు సర్వే విచారణ కార్యక్రమంలో ప్రత్యేక పర్యవేక్షణతో మృతి చెందిన ఓటర్లు, శాశ్వత వలసలు, డబుల్‌ ఎంట్రీ ఓటర్లు తొలగింపు విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఫారం - 8ను స్వీకరించి పూర్తి స్థాయిలో పరిశీలన నాలుగు రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. ఓటర్ల తొలగింపు ప్రక్రియలో నోటీస్‌ జారీ, శాశ్వత వలసల ఓటర్లు, మరణించిన ఓటర్ల పంచనామా, వీడియో స్టేట్మెంట్‌, తదితర అంశాలతో పారదర్శకంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటింటి ఓటర్ల పరిశీలన జిల్లాలో దాదాపుగా పూర్తయ్యిందని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరణ చేపట్టి ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్‌ కేంద్రాల వివరాలు తెలియజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అర్‌.గోవిందరావు, పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ పిఒలు కల్పనా కుమారి, సి.విష్ణుచరణ్‌, డిఆర్‌ఒ జె.వెంకట్రావు, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, ఆర్‌డిఒ కె.హేమలత, తదితరులు పాల్గొన్నారు.