ప్రజాశక్తి-డుబ్రిగుడ:మండలంలోని సాగర పంచాయతీ అడపావలస గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆ గ్రామస్తులు బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ మాట్లాడుతూ, గ్రామంలో గతంలో ఏర్పాటు చేసిన గ్రావిటీ పథకం మరమ్మతుకు గురవడంతో గత నెల రోజుల నుంచి తీవ్రమైన మంచినీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. గ్రామస్తులు సమీపంలో గెడ్డ నీటిని సేకరించి ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గ్రావిటీ పథకాన్ని మరమ్మత్తు చేసి తాగునీటి సౌకర్యం పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సిహెచ్ మంజుల ,పూర్ణిమ, కె.మితుల, వి.వంజన, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి:మండలంలోని నాన్ షెడ్యూల్ గరుగుబిల్లి పంచాయతీ పరిధి కూర్మనవలస గ్రామంలో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. బోరు మరమ్మతు పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు, పంచాయతీ ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకునే నాధుడే కరువయ్యారని మహిళలు విమర్శించారు. వార్డు మెంబర్ సన్యాసమ్మ మాట్లాడుతూ, గ్రామంలో బోరు మరమ్మతు చేపట్టక పోవడంతో కలుషితమైన గెడ్డ నీటిని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. దీంతో గిరిజనులు రోగాలకు గురవుతున్నారని అధికారులు తక్షణమే స్పందించి బోరు మరమ్మతు పనులు చేపట్టి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు పాల్గొన్నారు.










