పుట్టపర్తి రూరల్ : పుట్టపర్తి మండల పరిధిలోని చేపట్టిన క్వారీ ఏర్పాటుకు నిరసనగా నిడిమామిడి ,కొట్లపల్లి ,కొత్త నిడిమామిడి గ్రామాల ప్రజలు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు 118 సర్వే నెంబర్లలో మూడు క్వారీలను ఏర్పాటు చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణకు ఇటీవల ఆర్డీవో ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. అయితే గ్రామస్తులు క్వారీ ఏర్పాటుకు నిరాకరించారు. అయితే సంబందిత కాంట్రాక్టర్లు క్వారీ నిర్మాణ పనులు అలాగే కొనసాగిస్తుండగా ఆయా గ్రామాల ప్రజలు సోమవారం స్థానిక కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ క్వారీ నిర్మాణ పనులను వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేయడంతో పనులను మంగళవారం నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు, ప్రజలు మంగళవారం క్వారీ నిర్మాణ పనులు చేపడుతున్న స్థలం వద్దకు వెళ్లి క్వారీలు వద్దు, ఆరోగ్యమే ముద్దు అని నినాదాలు చేసుకుంటూ నిడిమామిడి కొట్లపల్లి సురగానిపల్లి ,కొత్త నిడిమామిడి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. కొంతమంది అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై క్వారీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని అలా జరిగితే గ్రామానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోట్లపల్లి, నిడిమామిడి, దండువారి పల్లి, కత్తి వారి పల్లి, సురగానపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.










