Oct 06,2023 21:42

హిందూపురం తహశీల్దార్‌ కార్యాలయంలో రాత్రి సమయంలో సిబ్బందితో కలిసి ఉన్న లేపాక్షి తహశీల్దార్‌ కె బాబు

ప్రజాశక్తి-హిందూపురం : తమ పేరిట ఉన్న భూములు అక్రమంగా కుశలవ ఆర్గానికిక్‌ ఉత్పత్తుల కంపెనీకి అధికారులు కట్టబెట్టారని,రికార్డుల్లో ఇప్పటకి తమ పేర్లే ఉన్నాయని, తమ భూములు తమకు ఇవ్వాలంటు సిపిఎం, కెవిపిఎస్‌ సహాకారంతో లేపాక్షి మండలం కొండూరు, కొర్లకుంట తదితర గ్రామాలకు చెందిన దళిత రైతులు అనేక రోజులుగా పోరాటాలు చేస్తున్నారు. లేపాక్షి తహశీల్దార్‌ కార్యాయలం ఎదుట శిబిరాన్ని ఏర్పాటు చేసి కొన్ని నెలల పాటు రీలే నిరాహార దీక్షలు చేశారు. అయితే పేదలకు అండగా నిలవాల్సిన అధికారులు కుశలవ కంపెనీకి గులాములుగా మారారు. ఇది చాలదన్నట్లు దళిత రైతుల పేరులో ఉన్నా పాత రికార్డులను తారుమారు చేస్తున్నారు. ఈ గోల్‌మాల్‌కు హిందూపురం తహశీల్దార్‌ కార్యాలయాన్ని వేదికగా మార్చుకున్నారు. రాత్రి కాగానే లేపాక్షి తహశీల్దార్‌తో పాటు కార్యలయ సిబ్బంది ఇక్కడికి వచ్చి రాత్రి పొద్దుపోయేదాక రికార్డులను తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు వినపిస్తున్నాయి. సొంత కార్యాలయాన్ని వదలి హిందూపురంలో రాత్రి పూట పని చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి, అక్రమాల కోసమే ఈతంతు కొనసాగిస్తున్నట్లు విమర్శలు వినపిస్తున్నాయి.
లేపాక్షి మండలం కొండూరు గ్రామ రెవెన్యూ పొలంలో 1961 నుండి 2008 సంవత్సరాల మధ్యకాలంలో సుమారు 200 ఎకరాలు 80 మంది దళిత రైతులకు డి పట్టాలను ప్రభుత్వం మంజూరు చేసింది. డి పట్టాలను పొందిన రైతులు భూమిని చదును చేసుకుని, వ్యవసాయాన్ని చేసుకుంటు 40 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే 2015 నుండి 2019 సంవత్సరాల మధ్య కాలంలో దళిత రైతుల వద్దకు అప్పటి తహశీల్దార్‌, కుశవల ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ చైర్మెన్‌ సి. జె. రామకృష్ణప్రసాద్‌ వచ్చి కంపెనీకి భూములు ఇవ్వాలని కోరారు. ఇలా అయితే ఇక్కడే ఉపాది లభిస్తుందని,మీ భూముల్లో బోర్లు వేయించి పంటలు పండిస్తామని, ఎకరాకు రూ.1లక్ష చోప్పున 20 సంవత్సరాలకు రూ.20లక్షలు ఇస్తామని నమ్మించారు. నిరక్ష్యరాస్యులైన దళిత రైతుల నుంచి అప్పటికే సిద్దం చేసిన పత్రాల్లో సంతకాలు చేయించుకున్నారు. సంతకాలు రాని వారి నుంచి వేలి ముద్రలు తీసుకోవడమే కాకుండా ఫోటోలను తీసుకున్నారు. ఒక సంవత్సరం పాటు వారి భూముల్లో కొంత మందికి పనులు కల్పించారు. అయితే సంవత్సరానికి ఇస్తామన్నా రూ.1లక్ష ఇవ్వలేదు. దళిత రైతులను కంపెని చుట్టూ తిప్పుకున్నారు. చివరకు వారు తమకు ఇస్తామన్నా డబ్బులు ఇవ్వాలని నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టారు. రైతుల నుంచి తాము భూములుకొన్నట్లు పత్రాలను చూపించారు. దీంతో అందరం మోసం పోయినట్లు గ్రహించారు. కొంత మంది భూములు వారి పేరుతో ఉన్నాయని, కొంత మంది భూములు కుశలవ కంపెనీ ఛైర్మన్‌ పేరుమీద ఉన్నాయని గుర్తించారు. ఈ తతంగం అంత అప్పటి తహశీల్దార్‌, చిలమత్తూరు సబ్‌ రిజిస్టర్‌కలిసి దళిత భూములను వారి ప్రమేయం లేకుండానే కంపెనీ చైర్మేన్‌ పేరుతో రిజిస్టర్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి దళితులు ఎన్నో పోరాటాలను చేశారు. అయినప్పటికి అధికారులు ఎవరు దళితుల పక్కన నిలబడలేదు. ప్రస్తుతం ఉన్నా తహశీల్దార్‌ కె బాబుకు దళిత రైతులు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరినప్పటికి అతను సైతం స్పందించలేదు. 1బి, అడంగళ్‌ రైతుల పేరున ఉన్నప్పటికి భూముల్లో మీరు వెళితే కేసులు నమోదు చేస్తామని బెదరింపులకు పాల్పడ్డారు. దీంతో అందరు కలిసి న్యాయం కోసం ఎస్‌సి కార్పోరేషన్‌ను ఆశ్రయించారు. దీంతో అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌, లేపాక్షి తహశీల్దార్‌కు నోటీసులు వచ్చాయి. అయినప్పటికి చట్టాలను తుంగలో తొక్కి భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు పూర్తిగ సహకరిస్తున్నారన్నా ఆరోపణలు వినపిస్తున్నాయి. 2007 చట్టం ప్రకారం అసైన్డ్‌ భూములను నిజమైన వారసులకు ఇవ్వాలని ఉన్నప్పటికి వారికి ఇవ్వకుండా స్థానిక రెవిన్యూ అధికారులు కావాలనే నిజమైన హక్కుదారులకు అన్యాయం చేస్తున్నారు.
కుశలవ భూ ఆక్రమణలు ఆపాలి : ప్రభుత్వ అసైన్డ్‌ భూములను నిజమైన హక్కుదారులకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు సిపిఎం, కెవిపిఎస్‌ ఆద్వర్యంలో దళిత రైతులు భూ పోరాటం చేపట్టారు. ఈ సందర్బంగా రైతులు వారి భూముల్లోకి వెళ్లి భూమిని చదును చేసుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో కంపెని వారితో కుమ్మక్కు అయిన తహశీల్దార్‌ దళితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. భూ పోరాటం సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతు అసైన్మెంట్‌ చట్టం 9/ 77 ప్రకారం పేదల భూములు పేదలకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో అధికారుల వైఖరి మార్చుకోవాలన్నారు.
రీ సర్వే పేరుతో రికార్డుల్లో మార్పులు
హిందూపురం తహశీల్దార్‌ కార్యాలయంలో లేపాక్షి తహశీల్దార్‌ బాబు రీసర్వే పేరుతో రికార్డుల్లో మార్పు చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. రీ సర్వే పేరుతో మండలంలోని కొండూరు, సిరివరం, చోళ సముద్రం తదితర పంచాయతీలకు సంబంధించిన గ్రామాల భూ రికార్డులను మార్పులు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత కార్యాలయంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే పూర్తి స్థాయిలో విధులు నిర్వహించని అధికారులు, సిబ్బంది ఇతర మండల కార్యాలయంలో, ఆ మండలానికి సంబంధించిన అధికారులు, సిబ్బంది లేని సమయంలో భూ రికార్డులు వన్‌ బి, ముటేషన్‌ తదితర దరఖాస్తులను ముందర వేసుకొని రాత్రి సమయంలో రికార్డులను మార్పులు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొండూరు సమీపంలో ఉన్నా కుశలవ భూముల రికార్డుల మార్పులు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అధికారులు భూ రికార్డుల్లో పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో తహశీల్దార్‌ బాబును ప్రశ్నించగా రీ సర్వే పనులు చేస్తున్నామని చెప్పారు. ఫోటోలు తీయగానే అక్కడి నుంచి అందరూ కార్యాలయానికి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. ఈ విషయంలో సబ్‌ కలెక్టర్‌, జిల్లా కలెక్టర్‌ విచారణ చేపట్టి నిజమైన భూహక్కుదారులకు భూములు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.