Oct 18,2023 19:59

అభివాదం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
కురువ మహా గర్జనను జయప్రదం చేయాలని బళ్లారి నగర మాజీ మేయర్‌ శశికళ కృష్ణమోహన్‌ కోరారు. బుధవారం ఆలూరు వాసవి కల్యాణ మండపంలో కురువ, మాదాసి కురువ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బీరప్ప స్వామి దేవాలయంలో పని చేస్తున్న పూజారులకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. మాదాసి, మాదారి కురువ కుల ధ్రువీకరణ పత్రాన్ని ఎస్సీ సర్టిఫికెట్‌ ఇవ్వాలని, గురవయ్యలను కళాకారులుగా గుర్తించి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. గొర్రెలు కాపలదారులుగా పంట పొలాల్లో ఉండే వారికి బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. నియోజకవర్గంలోని మండలాల్లో కనకదాసు విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలూ గుర్తింపు ఇవ్వాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా జనాభా ప్రాతిపదికన తమ వారికి పదవులు కేటాయించాలని కోరారు. జిల్లాల్లో దాదాపు 5 లక్షల ఓటర్లుగా ఉన్నామని అన్ని పార్టీలూ గుర్తించాలని తెలిపారు. డిసెంబర్‌ 10న కురువ మహా గర్జన నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తామని, అన్ని మండలాల నుంచి కురువలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పారిశ్రామికవేత్త కృష్ణమోహన్‌, పత్తికొండ మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి రంగస్వామి, రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్‌, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ జయరాం, రమేష్‌, దేవేంద్రప్ప, నాగరాజు, హాలహర్వి మండల నాయకులు రమేష్‌, హోళగుంద మండల నాయకులు గజ్జప్ప, చాగప్ప, మల్లయ్య పాల్గొన్నారు.