ప్రజాశక్తి - హోళగుంద
'కురువ గర్జన'ను జయప్రదం చేయాలని మాదాసి కురువ నాయకులు కోరారు. బళ్లారి మాజీ మేయర్ శశికళ కృష్ణమోహన్ సూచనల మేరకు శనివారం హోళగుందలోని మాదాసి కురువ సంఘం కార్యాలయంలో మాదాసి కురువ సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీరప్ప స్వామి దేవాలయంలో పని చేస్తున్న పూజారులకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. మాదాసి కురువ కుల ధ్రువీకరణ పత్రం ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. గురువయ్యలను కళాకారులుగా గుర్తించి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. గొర్రెల కాపలదారులకు పంట పొలాల్లో ఉన్న వారికి బీమా సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కనకదాసు విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఆలూరు నియోజకవర్గంలో డిసెంబర్ 10న కురువ మహాగర్జన నిర్వహిస్తామని, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘం నాయకులు ఎల్లార్తి పెద్ద దర్గన్న, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రామాంజిని, ముద్దటమాగి గర్జప్ప, చాగప్ప, గోపాల్, మాదాసి కురువ సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి మల్లయ్య, రాయన్న, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మంజు, నారెగలప్ప, ఎల్లార్తి లక్ష్మన్న, రాము, నల్లారెడ్డి పాల్గొన్నారు.
మాట్లాడుతున్న నాయకులు










