ప్రజాశక్తి - కురుపాం : నియోజకవర్గ కేంద్రమైన కురుపాం ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ ఉన్నత చదువుల నిమిత్తం మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల లేకపోవడం అన్యాయమని ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్ యాత్ర బృందం ఖండించింది. ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర ఆదివారం ఏడో రోజు కురుపాం మండలానికి చేరుకుంది. మొదటగా యాత్రను గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు జె.సరోజా, ఎం. మీనాక్షి, టి.శోభారాణి, ఎస్.వసంతరాణి తదితరులు స్థానిక గౌడవీధి దగ్గర స్వాగతం పలికి, సంఘీభావం తెలిపారు. కురుపాం మండల ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి ఎం.అన్నాజీ అధ్యక్ష్యతన మండలంలో గల స్థానిక వసతిగృహాలను, విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేలా తమ విధానాలను అనుసరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేసేలా అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న జగనన్న ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శింఆరు. కళాశాలలో నాన్ టీచింగ్ లెక్చరర్లను నియమించాలని, సంక్షేమ హాస్టలకు ప్రహరీ గోడలు నిర్మించాలని, మరుగుదొడ్లు, మంచినీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లలేక చదువులు మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి కనిపిస్తుందన్నారు. కావున, ప్రభుత్వ వెంటనే స్పందించి మెరుగైన విద్యాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కురుపాం మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకై ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న పోరాట కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ హాస్టల్‌కు బకాయిలుగా నిలిచిన మెస్ ( డైట్ ) బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు పెంచాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తొలగించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, డిగ్రీలో తీసుకొచ్చిన హానర్స్ - మైనర్ సబ్జెక్టు విధానాన్ని రద్దు చేయాలని, డిగ్రీ విద్యార్థులు ఇంటర్నషిప్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలని, ఎన్‌ఇపి, 117 జిఒ రద్దు చేయాలని, పాఠశాలల విలీనం ఆపాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, హాస్టళ్లలో పర్మినెంట్ వర్కర్లను, వార్డెన్లను నియమించాలని, పోస్టుమెట్రిక్ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, హాస్టళ్లలో ఎఎన్‌ఎంలను నియమించాలని లేని డిమాండ్ చేశారు. లేకుంటే సంగ్రామ యాత్ర అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రాజు, హెచ్.సింహాచలం, బి. గంగారావు, కె. భాస్కరరావు మరియు యాత్రలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అఖిల్, ఉమాశంకర్, సిసింద్రీ, అన్నాజీ, వెంకీ తదితరులు పాల్గొన్నారు.










