Jul 29,2023 22:22

కూలిపోయిన పాఠశాల తరగతి గది

          నల్లమాడ : శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలోని బాపనకుంటలో శనివారం నాడు పెనుప్రమాదం తప్పింది. ఈ పాఠశాల భవనం కుప్పకూలి పైకప్పుతో సహా కింద పడిపోయింది. మొహరం సందర్భంగా శనివారం సెలవు రోజుకావడంతో విద్యార్థులు ఎవరూ పాఠశాలలో లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి... నాలుగు రోజుల క్రితం కురిసిన జడివానకు ఈనెల 27న గురువారం ఈ పాఠశాల భవనంకు ఓవైపున ఉన్న గోడ నేల కూలింది. ఆరోజు కూడా విద్యార్థులు వరండాలో కూర్చోవడంతో అప్పుడే ప్రమాదం తప్పింది. కాగ పాఠశాల పూర్తిగా కూలిపోతే గోడలకు గల ఇనుప కిటికీలు, తలుపులు పాడవుతాయన్న ఉద్ధేశంతో గ్రామానికి చెందిన కొందరు శనివారం ఉదయం వాటిని తొలగించారు. కిటికీలు, తలుపులు తొలగించడంతో ఒక్కసారిగా పట్టుతప్పి పైకప్పు కూలిపోయింది. కాగా ఈ తరగతి గదిని 1986 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించారు. అప్పుటి ఎంపీ ఎస్‌.రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే సద్దపల్లి వెంకటరెడ్డి దీనిని ప్రారంభించారు. గ్రామస్తులు, పాఠశాల కమిటీ ఛైర్మన్‌, ఉపాధ్యాయులు దెబ్బతిన్న ఈ పాఠశాల భవనాన్ని మరమ్మతులు చేయాలని పలుసార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ తరగతి గది కూలిపోయింది.