ప్రజాశక్తి-పెద్దారవీడు: ప్రభుత్వ నీటి కుంటల నుంచి అక్రమంగా నీరు తోడే వారిపై చర్యలు తీసుకొని, పశు సంపదకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎపి గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దగ్గుబాటి సోమయ్య రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం యర్రగొండపాలెం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద గొర్రెలు,మేకల కాపర్లతో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ గ్రామంలో నాలుగు ప్రభుత్వ కుంటలు ఉన్నట్లు తెలిపారు. పశువుల తాగునీటికి ఈ కుంటలే ఆధారమని తెలిపారు. అయితే గ్రామంలోని కొంతమంది మిర్చి రైతులు రాత్రిపూట ఇంజన్లు పెట్టి కుంటలల్లోని నీటిని అక్రమంగా తోడేస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా నీరు లేక పశువులను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తున్నట్లు తెలిపారు. గంత్యరం లేక జీవాలను అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఈ విషయాన్ని అనేక సార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించినా పట్టించుకోక పోవడంతో ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి పశువులకు తాగునీటి కుంటల్లో నీరు తోడే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు గ్రామంలో చాటింపు వేయించాలన్నారు. అనంతరం తహశీల్దారు కష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. స్పందించిన తహశీల్దారు మాట్లాడుతూ నీరు అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గొర్రెలు,మేకల పెంపకందార్ల సంఘం జిల్లా నాయకులు బొమ్మనబోయిన శివయ్య, నక్క గంగరాజు, పుచ్చకాయల బాలయ్య, జి.మల్లయ్య, ఎన్.కాశయ్య, బి.ఆవులయ్య, ఎం.వెంకటేశ్వర్లు, బి.సుబ్బయ్య, ఎం.రాజు, బి.ఆంజనేయులు, బి.పెద్దవీరయ్య, పి.పెద్దయలయ్య తదితరులు పాల్గొన్నారు.










