
మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి నటప్రతిభను గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో నాలుగు వందలకుపైగా సినిమాల్లో నటించారు మమ్ముట్టి. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ నవతరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి అరంగేట్రం చేస్తూ ఆయన నటించిన చిత్రం పురు (పుజు). సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మమ్ముట్టి నెగిటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో నటించారు. ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి? అనే విషయాలు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే.. కుట్టన్ (మమ్ముట్టి) రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. భార్య చనిపోవడంతో ఆమె జ్ఞాపకాల్ని తల్చుకుంటూ అందిరికీ దూరంగా జీవిస్తుంటాడు. కొడుకు కిచ్చునే (వాసుదేవ్) అతడికి సర్వస్వం. క్రమశిక్షణ పేరుతో కొడుకును తన అదుపులో ఉంచుకోవడానికి కిచ్చుతో కాస్త కఠినంగా ప్రవర్తిస్తుంటాడు. తండ్రి మితిమీరిన ఆంక్షలు, ప్రవర్తన వల్ల కిచ్చు ఇబ్బంది పడుతుంటాడు. లోపల ద్వేషం ఉన్నా తండ్రి పట్ల ఉన్న భయం కారణంగా బయటకు వ్యక్తం చేయలేకపోతాడు. మరోవైపు, అతను సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తూ ఒక యాక్సిడెంట్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూంటాడు. కాగా కుట్టన్ సోదరి భారతి (పార్వతి తిరువోత్తు) పెద్దలను ఎదిరించి, కేపీ అనే ఓ రంగస్థల కళాకారుడిని ప్రేమవివాహం చేసుకుంటుంది. కేపీది తమకంటే తక్కువ కులం కావడంతో కుట్టన్ కుటుంబసభ్యులు వారిని దూరం పెడతారు. అనుకోకుండా కుట్టన్ ఉండే అపార్ట్‌మెంట్‌లోకి భర్తతో కలసి భారతి కొన్నాళ్లు ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. మరోవైపు కుట్టన్‌ను చంపేందుకు అతడి శత్రువులు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దాంతో ప్రతిరోజూ ప్రాణభయంతోనే అతడు బతుకుతుంటాడు. అతడిని చంపడానికి ప్రయత్నించిందెవరు? వారికి కుట్టన్‌కు సంబంధం ఏంటీ ? సోదరుడి అపార్ట్‌మెంట్‌లోకి దిగిన భారతి జీవితం ఏమైంది? చెల్లి ప్రేమను కుట్టన్ అర్థం చేసుకున్నాడా? కుట్టన్‌తో పాటు భారతి జీవితం చివరకు ఏ మలుపులు తిరిగిందన్నదే ఈ చిత్రం మిగతా భాగం.
రెగ్యులర్ కమర్షియల్ కథలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం సాగుతుంది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు. ఆద్యంతం నాటకీయత, థ్రిల్లింగ్ అంశాలతో సీరియస్‌గా సినిమా సాగుతుంది. కుల వివక్ష, కులదురంహకార హత్యల నేపథ్యంలో తెలుగుతో పాటు వివిధ భాషల్లో అనేక చిత్రాలు రూపొందాయి. కులాల మధ్య ఉండే అంతరాలను, అసమానతలను భిన్న కోణాల్లో ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఈ సినిమా కూడా ఆ పాయింట్‌తోనే తెరకెక్కింది. అట్టడుగు వర్గాల్లో మాత్రమే కాకుండా ఉన్నత కుటుంబాల్లో ఈ కుల వివక్ష ఎక్కువగానే ఉంటుందని దర్శకురాలు ఇందులో చూపించారు. కులదురహంకార హత్యల నేపథ్యానికి రివేంజ్ డ్రామాను జోడించి, సినిమాను తెరకెక్కించారు. కుటుంబ ప్రతిష్ట, కుల గౌరవం ముఖ్యమని నమ్మే ఓ వ్యక్తి జీవితం చివరకు ఎలా ముగిసిందో హృద్యంగా ఆవిష్కరించారు.
ప్రథమార్థం మొత్తం కుట్టన్‌తో పాటు అతడి కొడుకు కిచ్చు పాత్రల నేపథ్యంలో కథ నడుస్తుంది. తండ్రీకొడుకుల రొటీన్ జీవితాల్ని చూపిస్తూనే తన ప్రాణాలను కాపాడుకోవడానికి కుట్టన్ పడే తాపత్రయాన్ని ఆసక్తికరంగా చూపించారు. ద్వితీయార్థం కుట్టన్‌లో మార్పు కోసం సోదరి భారతి ప్రయత్నాలు చేయడం, తనను చంపడానికి ప్రయత్నించే శత్రువు ఎవరో తెలుసుకోవడానికి కుట్టన్ వేసే ప్లాన్స్‌తో ఉత్కంఠను పంచుతుంది. ప్రీక్లైమాక్స్‌తో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో దర్శకురాలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎండింగ్ ఈ సినిమాకు ప్రధానబలంగా నిలిచింది. తల్లిదండ్రులు కఠినంగా ప్రవర్తించినప్పుడు, పిల్లలు మానసికంగా ఎలా బాధపడతారో దర్శకుడు రథీనా అద్భుతంగా చూపించారు.
మమ్ముట్టి నటన, క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన ఇలాంటి క్యారెక్టర్‌ను స్టార్‌డమ్ ఉన్న నటుడు చేయడం అంటే సాహసమే. అనుక్షణం చావు భయంతో బతికే రిటైర్డ్ పోలీస్ పాత్రలో జీవించాడు. మమ్ముట్టి సోదరి పాత్రలో పార్వతి యాక్టింగ్ బాగుంది. కులం కంటే ప్రేమ గొప్పదని నమ్మే యువతిగా సందేశాత్మకంగా ఆమె క్యారెక్టర్ సాగుతుంది. మమ్ముట్టి కొడుకు పాత్రలో బాలనటుడు వాసుదేవ్ కూడా చక్కటి అభినయాన్ని కనబరిచాడు. మిగతా నటులు తమ పరిధిమేర నటించారు. సాంకేతికంగా అద్భుతంగా ఉంటుంది. తేని ఈశ్వర్ డార్క్ విజువల్స్, క్లోజప్ షాట్స్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. జేక్స్ బెజోరు సంగీతం చిత్రానికి హైలెట్. నెక్ట్స్ సమ్‌థింగ్ ఏదో జరగుతుందనిపించేలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. కెమెరా వర్క్ కూడా బాగుంది. అయితే వేగం లోపించడమే సినిమాకు ప్రధాన బలహీనత. ఓపికతో చూస్తే మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.
చిత్రం : పురు
నటీనటులు : మమ్ముట్టి, పార్వతి తిరువోతు, వాసుదేవ్ సజీత్ తదితరులు
నిర్మాత : ఎస్ జార్జ్
దర్శకత్వం : రథీనా పీటీ
సంగీతం : జేక్స్ బిజోరు
సినిమాటోగ్రఫీ : థేనీ ఈశ్వరన్
ఓటీటీ : సోనీ లివ్
విడుదల తేదీ : మే 13, 2022