
ఓవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరోవైపు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో అలరిస్తున్నారు కీర్తి సురేష్. అలా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'చిన్ని'. 'సాని కాయిధం' అనే తమిళ చిత్రం తెలుగులో 'చిన్ని' పేరుతో అనువాదమైంది. మే 6న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సోదరుడు, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. పోస్టర్లు, ప్రచార చిత్రాల్లో కీర్తి సురేష్ పూర్తి డీగ్లామర్‌గా కనిపించిన ఈ చిత్రం కథేంటి? ఇందులో కీర్తి నటన ఎలా ఉంది? సెల్వ రాఘవన్ పాత్ర ఏంటి? వంటి విశేషాలు తెలుసుకుందాం..
కథలోకి వెళ్తే.. చిన్ని (కీర్తి సురేష్) తీర ప్రాంతంలోని ఓ పల్లెటూరులో కానిస్టేబుల్. భర్త మారప్ప, ఐదేళ్ల కూతురు ధనతో సాధారణ జీవితం సాగిస్తుంటుంది. ఆమె భర్త మారప్ప స్థానికంగా ఉండే ఓ రైస్ మిల్లులో పని చేస్తుంటాడు. మిల్లులో కుల వివక్షను ఎదుర్కొంటుంటాడు. ఈ క్రమంలో మారప్ప స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. అది మారప్ప పనిచేసే మిల్లు ఓనర్‌కు నచ్చదు. దీంతో మారప్పను అవమానించడంతో పాటు తన భార్య గురించి తప్పుగా మాట్లాడతారు. దీంతో మారప్ప అగ్ర వర్ణానికి చెందిన వ్యక్తి ముఖంపై ఉమ్మేస్తాడు. ఈ క్రమంలో మిల్లు ఓనర్‌తో జరిగిన గొడవ అతనిపై మారప్ప చేయిచేసుకునే వరకూ వెళ్తుంది. అగ్ర కులానికి చెందిన ఆ మిల్లు యజమానులు, అతని స్నేహితులు.. దీన్ని పెద్ద అవమానంగా భావించి, మారప్ప కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు కుట్ర పన్నుతారు. భార్య పోలీస్ కావడంతోనే మారప్ప విర్రవీగుతున్నాడని భావించి, చిన్నిపై అత్యాచారానికి ఒడిగడతారు. అంతటితో ఆగకుండా మారప్ప, అతని కుమార్తె ఇంట్లో ఉండగా ఇంటికి నిప్పు పెట్టి, తగలబెడతారు. దీనిపై చిన్ని కోర్టును ఆశ్రయించగా.. అక్కడా న్యాయం జరిగేలా కనిపించదు. అదే సమయంలో చిన్ని సవతి తల్లి కొడుకైన రంగయ్య (శ్రీ రాఘవ) కూడా అదే వ్యక్తుల వల్ల తనకు జరిగిన అన్యాయానికి రగిలిపోతుంటాడు. అప్పుడు చిన్ని తీసుకున్న నిర్ణయం ఏంటి? రంగయ్య చిన్నికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాడు? ఇద్దరూ కలిసి వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారన్నదే మిగతా కథ.

ఈ చిత్రంలో కథంతా.. 1989 నాటి కాలంలో సాగుతుంది. అప్పటి సమాజంలో ఉన్న పేద, అగ్రవర్ణాల మధ్య ఆధిపత్య పోరులో బలైన కుటుంబాల ఇతివృత్తంగా కథను రాసుకున్నారు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్. ప్రతి కాండం, దాని నేపథ్యం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో మొదలు పెట్టి, దానికి కనెక్ట్ అయ్యేలా గతంలో ఏం జరిగిందన్న విషయాన్ని కలర్‌లో చూపించటం కొత్తగా ఉంది. చిన్ని, రంగయ్య కలిసి ఓ మహిళను హత్య చేయటంతో కథను మొదలుపెట్టిన దర్శకుడు, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిన్ని ఆశలు, ఆశయాలు.. మిల్లు ఓనర్‌తో భర్త మారప్ప గొడవ.. రంగయ్యతో చిన్ని కూతురు స్నేహం.. ఇలా కథ, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ కథా నేపథ్యాన్ని పరిచయం చేశాడు. ఎప్పుడైతే మిల్లు యజమానితో మారప్ప గొడవపడతాడో అసలు కథ అప్పుడే మొదలవుతుంది. కథలో కొత్తదనం లేకపోయినా ప్రేక్షకులను కథకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సఫలమయ్యారు. కాకపోతే కొన్ని సీన్లు రియాలిటీకి దూరంగా ఉంటాయి. ఇక చిన్ని పలికే సంభాషణలు నాటి సమాజంలో ఉన్న పరిస్థితులకు అద్దం పట్టాయి. సినిమాలో ప్రతి పాత్రనూ వివరంగా చూపించే క్రమంలో సాగదీసినట్లుగా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్‌ను ఎంజారు చేసే వారికి 'చిన్ని' కచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే కుటుంబంతో కలిసి చూడాలంటే కాస్త హింస ఎక్కువగా అనిపిస్తుంది.
'మహానటి' తర్వాత 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'గుడ్‌లక్ సఖి' వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కీర్తి సురేష్‌కి అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. కానీ 'చిన్ని'తో తన నటనలోని కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక రంగయ్య పాత్రలో సెల్వరాఘవన్ ఒదిగిపోయారు. నటనలో ఆయన మార్క్‌ను చూపించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సామ్ సీఎస్ బిజిఎం ఆకట్టుకుంటుంది. యామిని యజ్ఞమూర్తి సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. కథ, సన్నివేశంలో ఉన్న డెప్త్‌ను బట్టి వాడిన థీమ్స్, కలర్‌టోన్స్ బాగున్నాయి. నాగూరన్ ఎడిటింగ్‌కు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ఫైనల్‌గా డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిత్రం కథ కొత్తేమీ కాకున్నా తీర్చిదిద్దిన విధానం బాగుంది.
టైటిల్: చిన్ని
నటీనటులు: కీర్తి సురేష్, శ్రీ రాఘవన్, మురుగదాస్,కన్నా రవి, లిజీ అంటోని, వినోద్ మున్నా తదితరులు
కథ, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాత: డి. ప్రభాకరన్, సిద్ధార్థ్ రావిపాటి
మాటలు : కృష్ణకాంత్
సంగీతం: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ: యామిని యజ్ఞమూర్తి
ఎడిటింగ్: నాగూరన్ రామచంద్రన్
విడుదల తేది: మే 6, 2022
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో