Sep 09,2023 22:01

ఆత్మహత్యల నివారణ దినోత్సవంలో మాట్లాడుతున్న వక్తలు

          ప్రజాశక్తి-నార్పల   మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు క్షణికావేశాలకు లోనుకావొద్దని మానసిక వైద్య నిపుణులు విశ్వనాథరెడ్డి, డాక్టర్‌ రవిశంకర్‌ సూచించారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం మండల పరిధిలోని బి.పప్పురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో మానసిక జబ్బులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో చాలామంది మానసిక సమస్యలతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మవిశ్వాసానికి మించిన శక్తి ఏదీ లేదన్నారు. కావున మానసికంగా కుమిలిపోయే వారికి ధైర్యం కల్పించాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థులు పరీక్షలు సమీపించే కొద్దీ మానసిక ఆందోళనకు లోనై పరీక్షల్లో ఎక్కడ ఫెయిల్‌ అయిపోతామని భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కావున తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పప్పూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులు రవిశంకర్‌, సూపర్‌వైజర్లు శ్రీరాములు, సరస్వతమ్మ, ఎంపిహెచ్‌ఒ సుబ్రమణ్యం, ఏఎన్‌ఎం ఫరీదా, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.