గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్ డిమాండ్ చేశారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో సోమవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో జీవగెడ్డలపై సాగు నీటి ప్రాజెక్టులు, మినీ రిజర్వాయర్లు, చెక్ డాములు లేవన్నారు. గతంలో అక్కడక్కడ నిర్మించిన చెక్ డ్యాములు పూర్తిగా శిథిలమయ్యావని తెలిపారు. దీంతో గిరిజన రైతులు ఏటా వర్షాధారం పైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది అనుకున్నంత స్థాయిలో వర్షపాతం లేదన్నారు. జూలై నెల చివరిలో, ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలతోనే రైతులు వరి నాట్లు వేశారని తెలిపారు. మండలంలో ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో వరి నాట్లు పడలేదన్నారు. గత 15 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో వేసిన వరి నాట్లు కూడా పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న అరకొర భూమిలో కూడా రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు అందిస్తున్న సంపూర్ణమైన వ్యవసాయ రంగానికి ప్రభుత్వం సహకారం అందించడం లేదన్నారు. సకాలంలో సరైన వర్షాలు కురవకపోవడంతో గిరిజనలు కొండపోడు వ్యవసాయంలో కందులు, రాగులు, జొన్నలు, జోడి ఇతర పంటల కూడా వర్షాలు లేక పండడం లేదన్నారు. దీంతో కరువు ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం గుర్తించి కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కోశాధికారి మండంగి రమణ, నాయకులు ఎం సన్యాసిరావు, పువ్వల మోహన్ రావు, బిడ్డిక శంకర్ రావు, సుబ్బారావు, పాండు తదితరులు ఉన్నారు.










