
ప్రజాశక్తి- గిద్దలూరు రూరల్
మండలంలోని అన్ని గ్రామాలలో కరువు ఛాయలు అలుముకున్నాయని, కరువు నుంచి గిద్దలూరు మండలము రైతాంగాన్ని, వ్యవసాయ కూలీలని ఆదుకునే విధంగా గిద్దలూరు మండలాన్ని కరువు మండలంగా మండల ప్రజా పరిషత్ సమావేశం తీర్మానం చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో మండల ఎంపీపీ కడప లక్ష్మీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం గిద్దలూరు ఏరియా కమిటీ కన్వీనర్ రామకష్ణ మాట్లాడుతూ ఆగస్టు నుంచి ఇప్పటివరకు వర్షాలు లేక పంటలు ఎండు ముఖం పట్టాయని, రబీ సీజన్‌కు వర్షం పడితే పంటలు వేయాలని దుక్కులు దున్నుకొని ఎదురు చూస్తున్నారని అన్నారు. రైతాంగం పెట్టుబడులు పెట్టి తీవ్ర నష్టాల పాలయ్యారని, రైతాంగాన్ని ఆదుకునేపద్ధతిలో గిద్దలూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31వ తేదీన ప్రకటించిన 103 కరువు మండలాలలో ప్రకాశం జిల్లాలో ఏ ఒక్క మండలాన్ని ప్రకటించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. పశ్చిమ ప్రకాశం మార్కాపురం రెవిన్యూ డివిజన్ 13 మండలాలు కరువు ఛాయాల్లో ఉన్నాయని, ఇక్కడి పాలకులు ప్రభుత్వం దష్టికి తీసుకుపోక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొదటి దశ కరువు మండలాలలో మన ప్రకాశం జిల్లా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రకాశం జిల్లాను కరువు మండలాలుగా ప్రకటించాలని రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటరెడ్డి , సిఐటియు నాయకులు టి ఆవులయ్య ,బి నరసింహులు ఎస్కే అన్వర్ తదితరులు పాల్గొన్నారు.