Sep 26,2023 21:32

వినతిపత్రం అందజేస్తున్న రైతుసంఘం నాయకులు

       అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో కరువు ఏర్పడిన దృష్ట్యా కరువు మండలాలుగా ప్రకటించి రైతుల బ్యాంక్‌ అప్పులన్నీ మాఫీ చేసి సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఎపి కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఎం.బాలరంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతపురం డిప్యూటీ తహశీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 2023 ఖరీఫ్‌లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వర్షాబావంతో రైతులు, కూలీలు ఇబ్బందులు పడతున్నారని తెలిపారు. జిల్లాలో సాధారణ సాగు 9.15 ఎకరాలు అయితే, 6.22 లక్షల ఎకరాలలో మాత్రమే పంటలు సాగు చేశారని తెలిపారు. 35.7 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయ్యిందన్నారు. ప్రధాన పంటలు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. ప్రస్తుతం కరువు పరిస్థితుల్లో పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాలన్నారు. పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలన్నారు. విత్తనం వేయని రైతులకు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి కోసం ప్రతి కుటుంబానికీ రూ.25 వేలు ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఉపాధి హామీ పనులు వందరోజులు కల్పించాలన్నారు. కౌలు రైతులకూ నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.రామాంజినేయులు, వన్నూరప్ప, పుష్పరాజ్‌ పాల్గొన్నారు.